టాలీవుడ్‌కు నవంబరు భయం

మామూలుగా ఏడాది మొత్తంలో అన్ సీజన్ ఏది అంటే ఒకప్పుడు ఫిబ్రవరి-మార్చి నెలలనే చెప్పేవారు. అప్పుడు సినిమాలకు మహరాజ పోషకులైన యూత్ అంతా పరీక్షల్లో మునిగిపోయి ఉంటారు కాబట్టి సినిమాలకు సరైన కలెక్షన్లు ఉండవు. ఐతే కరోనా టైం నుంచి పరిస్థితి మారుతోంది.

చదువులు, పరీక్షల షెడ్యూళ్లన్నీ అటు ఇటు అవడం.. మధ్య మధ్యలో థియేటర్లు మూతపడడం వల్ల గత రెండేళ్ల నుంచి ఫిబ్రవరిలో పెద్ద పెద్ద సినిమాలను కూడా రిలీజ్ చేసేస్తున్నారు. అదే సమయంలో నవంబరు నెల బాగా డల్లుగా తయారవుతోంది. ఈ నెలలో సినిమాలు పెద్దగా ఆడట్లేదు. వసూళ్లు రాబట్లేదు. పేరున్న సినిమాలు ఈ నెలను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు.

అక్టోబరులో దసరాకు పెద్ద సినిమాలు రిలీజవతున్నాయి. తర్వాత డిసెంబరు మీద దృష్టిసారిస్తున్నారు. నవంబరు నెలంటే మాత్రం భయపడుతున్నారు. ఈ నెలకు ముందు అనుకున్న సినిమాలన్నింటినీ ఒక్కొక్కటిగా వాయిదా వేసుకుంటూ పోతున్నారు. ఊర్వశివో రాక్షసివో, యశోద మినహాయిస్తే ఈ నెలలో నోటెడ్ రిలీజెస్ ఏమీ ఉండేలా లేవు.

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, అహింస, హంట్ సహా చాలా సినిమాలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వాటి గురించి ఉన్నట్లుండి హడావుడి ఆగిపోయింది. కొన్నేళ్ల నుంచి నవంబరులో పెద్ద హిట్లేవీ లేకపోవడంతో ఈ నెలను అన్ సీజన్‌గా పరిగణిస్తున్నట్లున్నారు. ‘ఊర్వశివో రాక్షసివో’ మంచి టాక్ తెచ్చుకుని కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టకపోగా.. ‘యశోద’ పరిస్థితి ఏమవుతుందో చూడాలి. అది కూడా డల్లుగానే నడిస్తే నవంబరు భయాలు ఇంకా పెరిగిపోవడం ఖాయం.