9 నెలల్లో 4 మాస్ రిలీజులు

అసలు స్టార్ హీరోలకు కథలు దొరక్క, సరైన దర్శకులు సెట్ కాక నెలలు సంవత్సరాలు హారతి కర్పూరం చేస్తుంటే మాస్ మహారాజా రవితేజ్ మాత్రం నా రూటే సపరేటు అంటూ స్పీడ్ మాత్రం తగ్గించడం లేదు. డిజాస్టర్లు వస్తున్నా తగ్గేదేలే టైపులో దూసుకుపోతూనే ఉన్నాడు. క్రాక్ అంత పెద్ద హిట్టయ్యాక స్క్రిప్ట్ సెలక్షన్ లో ఇంకా జాగ్రత్తగా ఉంటాడనుకుంటే అదేం లేదని ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ ఫలితాలు ఋజువు చేశాయి. వాటి ఫలితాల్లో బాధ్యత దర్శకులదే అయిన్పప్పటికీ స్క్రిప్ట్ ఓకే చేసే టైంలో రవితేజ వీటిని సరిగా అంచనా వేయలేదనే కామెంట్లో నిజం లేకపోలేదు.

సరే జయాపజయాలు సహజమే కానీ రవితేజ రాబోయే తొమ్మిది నెలల్లో ఏకంగా నాలుగు రిలీజులతో అభిమానులకు వరసబెట్టి కానుకలు ఇవ్వబోతున్నాడు. డిసెంబర్ 23న ‘ధమాకా’తో ఇది మొదలుకానుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ రెగ్యులర్ ఫ్లేవర్ లోనే కనిపిస్తున్నప్పటికీ కంటెంట్ కనక మాస్ కి కనెక్ట్ అయితే ఈజీగా సేఫ్ అవ్వొచ్చు. కేవలం ఇరవై రోజుల గ్యాప్ తో చిరంజీవితో కలిసి చేసిన ‘వాల్తేర్ వీరయ్య’తో సంక్రాంతి బరిలో దిగుతాడు. పాత్ర నిడివి నలభై నిముషాలు ఉంటుందన్నారు కాబట్టి ఏదో చిన్న క్యామియోలాగా తేలిక చేయలేం.

సుధీర్ వర్మతో చేసున్న ‘రావణాసుర’ ఇంకొక్క నెల రోజుల కంటే తక్కువ షెడ్యూల్ లో పూర్తవుతుందట. ఇప్పుడున్న ప్లానింగ్ ప్రకారం అయితే ఏప్రిల్ 7 విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఆ తర్వాత కార్తీక ఘట్టమనేని డైరెక్షన్ లో నటిస్తున్న ‘ఈగల్’ని సెప్టెంబర్ లో థియేటర్ ప్లానింగ్ చేస్తున్నారు. ఇది కూడా సగానికి పైగానే అయిపోయిందట. మిగిలింది ‘టైగర్ నాగేశ్వరరావు’ ఒక్కటే. ఈ గెటప్ కోసం హెయిర్ స్టైల్, బాడీకి ప్రత్యేక మేకోవర్ అవసరం ఉండటంతో పైవన్నీ పూర్తి చేసి దీనికి ఎక్కువ శాతం డేట్లు ఇవ్వబోతున్నారు. ఇది మాత్రం 2024లోనే ఉంటుంది. ఇంత స్పీడ్ ఇంకే హీరోకుందంటే సమాధానం చెప్పడం కష్టం.