ప్రస్తుతం టాలీవుడ్లో అగ్ర దర్శకులుగా ఉన్న ప్రతి ఒక్కరూ మెగా ఫోన్ పట్టడానికి ముందు ఎన్నో కష్టాలు పడ్డవాళ్లే. ఇండస్ట్రీ ఎంట్రీ అంత సులువుగా ఏమీ దక్కలేదు వారికి. అలా బాగా కష్టపడి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న వాళ్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కమెడియన్ సునీల్‌తో కలిసి అవకాశాల కోసం ఆయన పడ్డ కష్టాల గురించి కొన్ని సందర్భాల్లో చెప్పుకున్నారు. ఆయన్ని మించి తన సన్నిహితులు కూడా ఈ కష్టాల గురించి ఇంటర్వ్యూల్లో చెబుతుంటారు.
తన కెరీర్ ఆరంభంలో బాగా ప్రోత్సహించిన వ్యక్తుల్లో ఒకడిగా త్రివిక్రమ్ చెప్పుకునే సీనియర్ రచయిత కొమ్మనాపల్లి గణపతి రావు తాజాగా ఒక ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు. ఇండస్ట్రీలో ప్రవేశించడానికి ముందు త్రివిక్రమ్ కలిసింది తననే అంటూ.. అతడికి తాను చూపించిన మార్గం గురించి ఆయన వివరించారు.
తాను అప్పట్లో హెచ్ఎంటీలో ఉద్యోగం చేస్తూ.. ఖాళీ దొరికినపుడు సినిమాలకు రచన చేస్తుండేవాడినని.. అలాంటి టైంలో త్రివిక్రమ్ తనను కలిసి అసిస్టెంటుగా అవకాశం ఇవ్వాలని కోరాడని కొమ్మనాపల్లి వెల్లడించారు. ఐతే తానే ఫిలిం ఇండస్ట్రీలో పార్ట్ టైం పని చేస్తున్నానని.. అలాంటపుడు అసిస్టెంటుగా ఎలా చేర్చుకుంటానని అన్నానని చెప్పారు. ఇంతకీ ఏం చదివావు అని అడిగితే.. ఎమ్మెస్సీ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్టునని త్రివిక్రమ్ చెప్పగా.. బుద్ధుందా నీకు, ఫిలిం ఇండస్ట్రీలో చాలా వరస్ట్‌గా ఉంటుంది, చక్కగా నీ చదువుకు తగ్గ ఉద్యోగం చేసుకో అంటూ త్రివిక్రమ్‌ను తిట్టినట్లు తెలిపారు కొమ్మనాపల్లి.
ఐతే త్రివిక్రమ్ మాత్రం తనకు ఫిలిం ఇండస్ట్రీనే ఇష్టమని, ఇక్కడే ఉంటానని తేల్చిచెప్పాడన్నారు. సరే అయితే ఇప్పటిదాకా ఏం కథలు రాశావని అడిగితే.. ఏమీ లేదని చెప్పాడని.. ఏదో ఒకటి రాస్తే కదా నీ టాలెంట్ తెలిసేది అని చెప్పగా.. మరుసటి రోజే ‘ది రూడ్’ అనే కథ రాసుకుని తన దగ్గరకు వచ్చాడని, అది చదివి తాను ఆశ్చర్యపోయానని, అంత బాగా రాశాడని.. వెంటనే ఆంధ్రజ్యోతి ఎడిటర్‌కు ఫోన్ చేసి చెప్పగా.. వీక్లీలో ఆ కథ పబ్లిష్ చేశారని.. దాన్ని తీసుకొచ్చి మహదానందపడిపోతూ త్రివిక్రమ్ తనకు చూపించాడని కొమ్మనాపల్లి చెప్పారు. ఇది పట్టుకుని తాను ఇలాంటి కథలు చాలా రాశానంటూ బిల్డప్ ఇవ్వాలని, ఇండస్ట్రీలో అలా చెప్పుకోవడం అవసరమని చెప్పి.. తర్వాత తానే ‘మెరుపు’ అనే సినిమాకు అప్రెంటీస్‌గా చేర్చానని.. ఐదు రోజుల తర్వాత ఏదో ఇబ్బంది వల్ల అక్కడ మానేశాడని.. తర్వాత స్రవంతి రవికిషోర్ లాంటి వ్యక్తుల పరిచయంతో త్రివిక్రమ్ దశ తిరిగిందని.. తర్వాత అతణ్ని ఎవరూ ఆపలేకపోయారని కొమ్మనాపల్లి చెప్పారు. ఐతే తాను చేసింది చిన్నసాయమే అయినా.. పలుమార్లు తన గురించి ఇంటర్వ్యూల్లో చెప్పడం త్రివిక్రమ్ సంస్కారం అని, అందుకే అతను గొప్ప స్థాయికి వెళ్లాడని కొమ్మనాపల్లి చెప్పారు.