ప్రభాస్ అభిమానులు ‘ఆదిపురుష్’ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా గురించి దర్శక నిర్మాత ఓం రౌత్ ఇచ్చిన బిల్డప్ అలాంటిలాంటిది కాదు. ఒక అద్బుతాన్ని భారతీయ వెండి తెర మీద ఆవిష్కరిస్తున్నట్లు చెప్పుకున్నాడు. షూటింగ్ చకచకా పూర్తి చేసి ఏడాదికి పైగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నం అయి ఉన్న అతను.. దసరా టైంలో అభిమానులను బాగా ఊరించి ఊరించి టీజర్ రిలీజ్ చేశాడు. అది చూస్తే విపరీతమైన విమర్శలకు దారి తీసింది.
విజువల్ ఎఫెక్ట్స్, అలాగే రావణుడు, హనుమంతుడు పాత్రధారుల అప్పీయిరెన్స్ మీద, టీజర్లో చూపించిన వింత జీవుల విషయమై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దీని గురించి మీడియా ఇంటర్వ్యూలో ఎంత కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా.. త్రీడీలో వేరే ఎక్స్‌పీరియన్స్ ఉంటుందంటూ మీడియా వాళ్లకు స్పెషల్ స్క్రీనింగ్స్ వేసినా పెద్దగా ఫలితం లేకపోయింది.
ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన సినిమా మీద ఈ స్థాయిలో ట్రోలింగ్ జరగడం చూసి చిత్ర బృందం బెంబేలెత్తినట్లే ఉంది. ఈ సినిమాను ముందు అన్నట్లు సంక్రాంతికి రిలీజ్ చేస్తే రిజల్ట్ తేడా కొడుతుందని అర్థం చేసుకున్నట్లే ఉంది. సినిమాకు కరెక్షన్లు చేయడంతో పాటు పోటీ లేకుండా సోలో రిలీజ్ ఉండేలా చూసుకోవడం చాలా అవసరమని గుర్తించారు. అందుకే ఇగోకు పోకుండా సినిమాను వాయిదా వేశారు. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో చిన్న చిన్న కరెక్షన్లతో సరిపెడితే సినిమా వర్కవుట్ కాదన్న ఉద్దేశంతో చాలా వరకు మార్పులు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మళ్లీ కొత్తగా వీఎఫెక్స్ స్టూడియోలతో ఒప్పందాలు చేసుకుని.. పెద్ద ఎత్తునే మార్పులు చేయడానికి సిద్ధపడ్డట్లు తెలుస్తోంది. ఇందుకోసం కొత్తగా రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ఆ మాత్రం ఖర్చు చేస్తే తప్ప అనుకున్న స్థాయిలో భారీ వసూళ్లు రావని, బడ్జెట్ రికవరీ కష్టమని భావించి ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వేసవికి కూడా ఈ సిిమా రిలీజ్ కావడం సందేహమే అంటున్నారు.