రియాలిటీని అర్థం చేసుకున్న ఆదిపురుష్‌

మొత్తానికి కొన్ని రోజులుగా ప్ర‌చారంలో ఉన్న విష‌య‌మే నిజ‌మ‌ని తేలిపోయింది. ప్ర‌భాస్‌ను రాముడిగా చూపిస్తూ తానాజీ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ రూపొందించిన 500 కోట్ల భారీ చిత్రం ఆదిపురుష్ సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకుంది. దీని గురించి ఇంకా చిత్ర బృందం నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు కానీ.. అది లాంఛ‌న‌మే. ఎందుకంటే సినిమాను కొన్న డిస్ట్రిబ్యూట‌ర్లంద‌రికీ ఈ మేర‌కు స‌మాచారం చేరిపోయింది.

ఐతే బాహుబ‌లి త‌ర్వాత‌ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్‌గా అవ‌త‌రించిన ప్ర‌భాస్‌.. సంక్రాంతి పోటీకి భ‌య‌ప‌డి వెన‌క్కి త‌గ్గాడ‌న్న మాట‌ను అత‌డి అభిమానులు త‌ట్టుకోలేక‌పోతున్నారు. చెప్పిన‌ట్లే సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాల్సింద‌ని అంటున్నారు. సంక్రాంతి పోటీకి తోడు టీజ‌ర్‌కు వ‌చ్చిన నెగెటివ్ రెస్పాన్స్ చూసి భ‌య‌ప‌డి వెన‌క్కి త‌గ్గ‌డం వారికి అస్స‌లు రుచించ‌డం లేదు.

కానీ ఆదిపురుష్ చిన్నా చిత‌కా సినిమా అయితే రిస్క్ చేయొచ్చు. కానీ దాని మీద పెట్టుబ‌డి రూ.500 కోట్లు. అస‌లే ప్ర‌భాస్ చివ‌రి రెండు సినిమాలు ఒక‌దాన్ని మించి ఒక‌టి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టాయి. ఇంకో సినిమా కూడా పోతే మార్కెట్ మీద తీవ్ర ప్ర‌భాం ప‌డుతుంది. ఆదిపురుష్ టీజ‌ర్‌కు వ‌చ్చిన రెస్పాన్స్‌ను బ‌ట్టి చూస్తే సినిమా కూడా అలాగే ఉంటే పెద్ద ట్రోల్ మెటీరియ‌ల్‌గా మారొచ్చు. కాబ‌ట్టి రావ‌ణుడు, హ‌నుమంతుడు పాత్ర‌ల అప్పీరియెన్స్ మారాల్సిందే. ఇక విజువ‌ల్ ఎఫెక్ట్స్ విష‌యంలోనూ క‌చ్చితంగా క‌రెక్ష‌న్లు జ‌ర‌గాల్సిందే. ఇందుకోసం ఎంత స‌మ‌యం ప‌ట్టినా ఆగాల్సిందే.

మ‌రోవైపు ఇలాంటి భారీ పాన్ ఇండియా సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తే.. ద‌క్షిణాదిన అంత‌టా చాలా త‌క్కువ థియేట‌ర్లు ద‌క్కుతాయి. మామూలుగానే క‌లెక్ష‌న్లు బాగా త‌గ్గిపోతాయి. అంత పోటీలో టాక్ అటు ఇటు అయితే అంతే సంగ‌తులు. సినిమా దారుణంగా దెబ్బ తింటుంది. కాబ‌ట్టి ఏ ర‌కంగా చూసినా సంక్రాంతి రేసు నుంచి సినిమాను త‌ప్పించ‌డం స‌రైన నిర్ణ‌య‌మే. ఇగోకు పోయి పోటీకి సై అన‌డం కంటే రియాలిటీని అర్థం చేసుకుని వెన‌క్కి త‌గ్గ‌డం చాలా మంచిద‌న‌డంలో సందేహ‌మే లేదు.