తాను ఎవరినీ మోసం చేయలేదని కేవలం తనను నమ్మి టికెట్లు కొన్న ఆడియన్స్ కి మాత్రమే బాధ్యత వహిస్తానని పూరి జగన్నాధ్ విడుదల చేసిన ఒక నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. డిజాస్టర్ వచ్చినప్పుడు ఇంత నిజాయితీగా ఒప్పుకోవడం మంచి విషయమే. ఎవరి మీదో నెట్టేయకుండా నా వల్లే జరిగిందని చెప్పడం జ్ఞానోదయమే. కానీ ఒకసారి తప్పు జరిగినప్పుడు దాన్ని వీలైనంత త్వరగా సరిదిద్దుకునే ప్రయత్నం చేసినప్పుడే కదా మనమనే మాటకు విలువుంటుంది. ఇప్పుడు నెటిజెన్ల మధ్యే సరిగ్గా ఇదే అంశం మీద తీవ్ర చర్చ ప్లస్ వాదోపవాదాలు జరుగుతున్నాయి.
పూరి గత పదేళ్ల కెరీర్ ని ప్రామాణికంగా తీసుకుంటే ఈ మొత్తం దశాబ్దంలో గట్టిగా చెప్పుకునే హిట్లు మూడే . మొదటిది బిజినెస్ మెన్. ఇది కూడా పోకిరి స్థాయిలో ఆడలేదు కానీ కమర్షియల్ గా పెద్ద సక్సెస్. రెండోది టెంపర్. మొదటిసారి బయటి రైటర్ వక్కంతం వంశీ నుంచి తీసుకున్న కథ. మిగిలినవాటిలో దేవుడు చేసిన మనుషులు, జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం, రోగ్, మెహబూబా డిజాస్టర్లన్నీ పూరి ఖాతాలోవే. బాలయ్య ఇమేజ్ ఎంత గట్టెక్కించే ప్రయత్నం చేసినా పైసా వసూల్ యావరేజ్ కాలేకపోయింది. రచన అందించిన రోమియో, రొమాంటిక్ లాంటివి అసలు జనానికి గుర్తు కూడా లేవు.
ఒక్క ఇస్మార్ట్ శంకర్ మాత్రమే మాస్ కంటెంట్ తో మెగా హిట్ అయ్యింది. కట్ చేస్తే ఇప్పుడు లైగర్. ఇచ్చిన సక్సెస్ లకన్నా ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్న పూరి ఇదేదో నేను నా రాక్షసి, ఏక్ నిరంజన్ టైంలో రియలైజ్ అయ్యుంటే పైన చెప్పిన ఫ్లాపులు వచ్చేవి కాదేమో. ఒకప్పటి పూరి మేజిక్ వీటిలో మిస్ అవ్వడం వల్లేగా ఈ అనర్ధమంతా. ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి, దేశముదురు నాటి పూరి బయటికి రావాలి. లైగర్ లో రైటింగ్ తో మొదలుపెట్టి టేకింగ్ దాకా తేలికతనం చాలా కనిపిస్తుంది. ఇప్పుడు కన్ఫెస్ చేసుకోవడం ఓకే కానీ మున్ముందు మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవడం పూరి చేతుల్లోనే ఉంది.