మెగాస్టార్ చిరంజీవి స్టార్ డమ్ గురించి, ఆయన నటనా కౌశలం గురించి.. ఇంకా డ్యాన్సులు, ఫైట్లలో ఆయన చూపించే గ్రేస్ గురించి, వ్యక్తిగా ఆయన గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పట్నుంచో అందరూ ఆయన్ని చూస్తున్నారు. కానీ ఈ జనరేషన్‌కు చిరు గురించి అంతగా తెలియకపోవచ్చు. అలాంటి వాళ్లకు చిరును అభిమానించే వాళ్లు ఆయన గురించి కథలు కథలుగా చెబుతుంటారు.
ఐతే బయటి వారి సంగతేమో కానీ.. తన కుటుంబంలోనే కొత్త తరం పిల్లలకు తన గురించి పెద్దగా తెలియకపోవడం పట్ల తాను కొంచెం బాధపడ్డానని, అందుకే వారి దగ్గర సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సి వచ్చిందని చిరు తాజాగా జర్నలిస్ట్ ప్రభు రాసిన ఒక పుస్తకావిష్కరణ సభలో చెప్పడం విశేషం. ఈ అనుభవం గురించి ఆయనేమన్నారంటే..
“మా ఇంట్లో నా మనవళ్లు, మనవరాళ్లు ఎప్పుడు చూసినా చరణ్, తేజ్, వైష్ణవ్ సినిమాలు, పాటలే చూస్తున్నారు. నా సినిమాల గురించీ, నా పాటల గురించీ ఎవరూ పట్టించుకోరు. దాంతో నా మనసులో ఒకరకమైన జెలసీ ఫీలింగ్ కలిగింది. అప్పుడు వాళ్లందరినీ కూర్చొబెట్టుకుని నా గురించి నేనే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్ టైంలో వాళ్లందరికీ ఒకప్పటి నా సినిమాలు, పాటలు చూపించా. భయ్యా ఇది నువ్వా.. అంటూ వాళ్లంతా ఆశ్చర్యపోయారు. నా వయసు పెరిగినప్పటికీ పిల్లలంతా నన్ను ‘భయ్యా’ అనే అంటుంటారు. వాళ్లు అలా పిలవడం నాకు ఆనందమే. అలా నా గురించి నేనే నా ఇంట్లో సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సివచ్చింది. నా అదృష్టం ఏంటంటే.. వాళ్లందరికీ ‘గాడ్ ఫాదర్’ సినిమా నచ్చింది. ఒక్కొక్కరూ నాలుగుసార్లు చూశారట” అని చిరు చెప్పడం విశేషం.
ఇదే వేడుకలో తనతో అభిమానులు ఫొటోల కోసం ప్రయత్నిస్తున్నపుడు ఆయన లేరు కదా అంటూ పరోక్షంగా గరికపాటికి చిరు కౌంటర్ వేయడం చర్చనీయాంశం అయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates