ఉచ్చులో పడకుండా యష్ ప్లానింగ్

ఏ హీరోకైనా ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడం పెద్ద సవాల్. అప్పటిదాకా ఒక రాష్ట్రానికే పరిమితమైన అంచనాలు ఏకంగా దేశవ్యాప్త ప్రేక్షకులకు పాకుతాయి కాబట్టి వాటిని ఏ మాత్రం అందుకోలేకపోయినా ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రభాస్ కు ఆ సమస్యే వచ్చి పడింది. బాహుబలి దెబ్బకు తన ఎనర్జీని స్టామినాని పూర్తి స్థాయిలో వాడుకునే దర్శకులు దొరక్క సాహో, రాధే శ్యామ్ లను సింగల్ మూవీ డైరెక్టర్ల చేతిలో పెట్టి డిజాస్టర్లు అందుకున్నాడు. ఇప్పుడు ఆది పురుష్ విషయంలోనూ ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఫ్యాన్స్ ని కలవరపెట్టేవే

ఇక్కడే కన్నడ హీరో యష్ చాలా తెలివిగా మసలుకుంటున్నాడు. హిందీ నిర్మాతలు ఎంత క్రేజీ ఆఫర్లు ఇస్తున్నా సరే వాటికి తలూపకుండా ఎంత ఆలస్యమైనా సరే ముందు నుంచి తన వెంటపడుతూ కథను ఓకే చేసుకున్న నర్తన్ కే 19వ సినిమా ఫైనల్ చేశాడు. బ్రహ్మాస్త్ర పార్ట్ 1లో రన్బీర్ చేసిన పాత్ర, రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా ప్లాన్ చేసుకున్న కర్ణలో టైటిల్ క్యారెక్టర్ రెండూ ముందు యష్ కే వచ్చాయనే ప్రచారం ముంబై మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒకవేళ అదే నిజమైతే ఇతగాడి నిర్ణయాలు భేష్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే సౌత్ దర్శకులకు తెలిసినంతగా ఆడియన్స్ పల్స్ ఇంకెవరికీ లేదు.

రాఖీ భాయ్ గా తన బ్రాండ్ వేల్యూ ఎంతగా పెరిగినా సరే యష్ వేగంగా సినిమాలు చేసేందుకు పరుగులు పెట్టడం లేదు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఫ్లాపులు వచ్చి పడతాయని తెలుసు. అందులోనూ కన్నడ సీమకే తన ప్రాధాన్యమని ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్న యష్ ఆ కారణంగానే లైగర్ నిర్మాణంలో ఉన్న టైంలో పూరి జగన్నాధ్ వచ్చి ఒక లైన్ వినిపించినప్పుడు నో అన్నాడనే వార్త బెంగళూరు సర్కిల్స్ లో చక్కర్లు కొట్టింది. ఏ రకంగా చూసుకున్నా నిదానమే ప్రధానం సూత్రాన్ని పాటిస్తున్న యష్ కెరీర్ ప్లానింగ్ జాగ్రత్తగా చేసుకుంటున్నాడు