టాలీవుడ్లో మళ్లీ డ్రై రన్ మొదలైనట్లే కనిపిస్తోంది. దసరా, దీపావళి సినిమాలతో ఈ నెలలో ఇప్పటి వరకు బాక్సాఫీస్‌లో బాగానే సందడి నడిచింది. ఐతే దీపావళి సినిమాలకే ఆశించిన స్పందన కనిపించట్లేదు. అన్నింట్లోకి ‘సర్దార్’ సినిమా మెరుగ్గా పెర్ఫామ్ చేస్తోంది.
‘ఓరిదేవుడా’ మంచి టాక్ తెచ్చుకుని కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ప్రిన్స్, జిన్నా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినట్లే కనిపిస్తున్నాయి. ఐతే ఉన్నంతలో దీపావళి వీకెండ్ పరిస్థితి మెరుగ్గానే కనిపించింది కానీ.. రాబోయే నెల రోజుల్లో మాత్రం చాలా వరకు బాక్సాఫీస్ వెలవెలబోయే పరిస్థితే కనిపిస్తోంది. మామూలుగా ఎప్పుడూ కూడా దసరా, దీపావళి సందడి తర్వాత బాక్సాఫీస్‌లో సందడి తగ్గిపోతుంది. నవంబర్లో డ్రై రన్ నడుస్తోంది. ఈసారి కూడా పరిస్థితి భిన్నంగా ఉండేలా లేదు.
దీపావళి తర్వాతి వారం నుంచి నెల రోజుల పాటు బాక్సాఫీస్‌లో పెద్దగా సందడి కనిపించే అవకాశం లేదు. ఈ వారం పరిస్థితే చూస్తే చెప్పుకోదగ్గ సినిమా ఏదీ రిలీజ్ కావట్లేదు. ‘అనుకోని ప్రయాణం’ అనే రాజేంద్ర ప్రసాద్ సినిమానే కాస్త చెప్పుకోదగ్గది. ఈ వారానికి షెడ్యూల్ అయిన ‘అహింస’ నవంబరు మూడో వారానికి వాయిదా పడింది.
ఇక నవంబరు తొలి వారానికి బొమ్మ బ్లాక్‌బస్టర్, లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ లాంటి చిన్న సినిమాలే రిలీజవుతున్నాయి. తర్వాతి వారానికి సమంత సినిమా ‘యశోద’, అల్లరి నరేష్ మూవీ ‘మారేడుమిల్లి ప్రజానీకం’ రిలీజవుతున్నాయి. అవి కూడా మరీ భారీ అంచనాలున్న సినిమాలు కాదు. కానీ ఉన్నంతలో వాటి పరిస్థితి మెరుగే.
తర్వాతి రెండు వారాల్లో అహింస, హంట్ లాంటి సినిమాలు వస్తాయి. ఇక ఈ నాలుగైదు వారాల్లో క్లియరెన్స్ సేల్ తరహాలో చాలా సినిమాలు థియేటర్లలోకి నామమాత్రంగా దిగబోతున్నాయి. మళ్లీ డిసెంబరు తొలి వారంలో హిట్-2 వచ్చే వరకు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సందడి కనిపించకపోవచ్చు.