తమిళ సినిమా తీసి తప్పు చేశాడా?


‘జాతిరత్నాలు’ సినిమాతో యువ దర్శకుడు అనుదీప్ పేరు ఎంతగా మార్మోగిందో తెలిసిందే. అంతకుముందే అతను ‘పిట్టగోడ’ అనే చిన్న సినిమా ఒకటి తీశాడు. ఆ పేరుతో ఓ సినిమా రిలీజైన సంగతి కూడా జనాలకు తెలియదు. ఐతే ఆ చిత్ర ఫలితంతో సంబంధం లేకుండా స్వప్న సినిమా లాంటి పేరున్న బేనర్లో అవకాశం దక్కించుకున్నాడు. నాగ్ అశ్విన్ అండతో ‘జాతిరత్నాలు’ సినిమా తీసి బ్లాక్‌బస్టర్ అందించాడు. ఆ సినిమా పెట్టుబడి మీద నాలుగైదు రెట్ల ఆదాయం తెచ్చిపెట్టి ఔరా అనిపించింది.

దీని తర్వాత తమిళంలో స్టార్ హీరో అయిన శివ కార్తికేయన్‌తో ‘ప్రిన్స్’ తీసే అవకాశం అందుకున్నాడు. దగ్గుబాటి సురేష్, సునీల్ నారంగ్ లాంటి పెద్ద నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలకు ముందు మంచి బజ్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని దక్కించుకోవట్లేదు.

తమిళంలో ఓ మోస్తరుగా ఆడుతున్న ‘ప్రిన్స్’ తెలుగులో మాత్రం తొలి రోజే చతికిలపడింది. నెగెటివ్ టాక్‌ తెచ్చుకున్న సినిమాను తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ‘జాతిరత్నాలు’ ఫార్మాట్లోనే అనుదీప్ ఈ సినిమా తీశాడు. కామెడీ సిచువేషన్లు, డైలాగులు దాదాపుగా ఆ సినిమానే పోలి ఉంటాయి. అనుదీప్ మార్కు జోక్స్ ఇందులో ఉన్నాయి. కానీ ‘జాతిరత్నాలు’లో మాదిరి కామెడీ ఇక్కడ వర్కవుట్ కాలేదు. నేటివిటీ ఫ్యాక్టర్ పూర్తిగా మిస్ అయింది.

అలాగే నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి మాదిరి అనుదీప్ కామెడీ టైమింగ్‌ను అర్థం చేసుకుని నటించే నటీనటులు లేని లోటు కనిపించింది. ఇదే కాన్సెప్ట్‌ను తెలుగు నటీనటులతో చేసి ఉంటే.. యాక్టర్స్ కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్‌గా కుదిరి ఉంటే సినిమా ప్రేక్షకులకు వేరే ఫీలింగ్ కలిగించేది. అలా అని తమిళంలో అయినా ‘ప్రిన్స్’ డిఫరెంట్ ఫీలింగ్ కలిగించిందా అంటే అదీ లేదు. అక్కడా సినిమాకు ఆశించిన స్పందన రావట్లేదు. కామెడీ కొంతమేర వర్కవుట్ అయినా చాలా వరకు సినిమా మీద విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి అనుదీప్ తమిళ సినిమా తీయడం ద్వారా తప్పటడుగు వేశాడనే చెప్పాలి.