కంటెంట్ తో మెప్పించాడు.. కానీ !

రెండు , మూడు సినిమాలకే సూర్య తమ్ముడు అనే బిరుదు చెరిపేసుకొని విభిన్న కథలు ఎంచుకునే హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కార్తి లేటెస్ట్ గా ‘సర్దార్’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా రిలీజ్ కి ముందు జస్ట్ ఓ మోస్తారు ప్రమోషన్స్ మాత్రమే చేశారు. రిలీజ్ రెండ్రోజుల ముందుకు హైదరాబాద్ వచ్చి కొన్ని ఇంటర్వ్యూలు , నాగ్ గెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకెళ్ళిపోయాడు కార్తి.

నాలుగు సినిమాల మధ్య వచ్చిన కార్తి సర్దార్ అన్నిటిలో బెటర్ అనిపించుకుంది. కంటెంట్ తో మెస్మరైజ్ చేసి ప్రేక్షకులను మెప్పిస్తుంది. కానీ సినిమాకు ఉన్న ప్రదాన సమస్య రన్ టైం. అదే సినిమాకు మేజర్ మైనస్ అనిపించుకుంది. సినిమా చూసిన వారంతా పాయింట్ బాగుంది కానీ డ్రాగ్ చేసి నడిపించడమే ఇబ్బంది పెట్టింది అంటున్నారు.

నిజానికి ఇప్పుడొస్తున్న సినిమాలకు నిడివి అనేది మైనస్ గా మారుతుంది. రెండున్నర గంటలలోపైతే ఫరవాలేదు కానీ ఆ లైన్ కాస్త దాటిందా అంతే ఆడియన్స్ బోర్ ఫీలవుతున్నారు. కార్తి సర్దార్ కి అదే జరిగింది. స్పై థ్రిల్లర్ కథతో కార్తి మెప్పించి అలరించాడు కానీ వచ్చిన సమస్య అంతా నిడివితోనే. ఈ సినిమాను ఏకంగా రెండు గంటల యాబై నిమిషాల నిడివితో చూపించాలని మేకర్స్ చేసిన ప్రయత్నం తేడా కొట్టింది. దీంతో టాక్ బాగున్నా రన్ టైం సమస్య సినిమా రిజల్ట్ పై గట్టి ప్రభావం చూపిస్తుంది.

మొన్నీ మధ్య నాని కూడా అంటే సుందరానికి ప్రయత్నం చేసాడు కానీ రన్ టైం ఎక్కువ కారణంగా ఆ సినిమా ఆడియన్స్ కి బోర్ కొట్టించి మోస్తరు కలెక్షన్స్ సరిపెట్టుకోనేలా చేసింది. ఏదేమైనా రన్ టైం అనేడి ఇప్పుడు చాలా కీలకంగా మారింది. మేకర్స్ నిడివి లైట్ తీసుకొని జనాలు చూస్తారులే అనుకుంటే మొదటికే మోసం వస్తుంది.