వ‌ర్మ చెప్పిన గీతాంజ‌లి సీక్రెట్


తెలుగులో వ‌చ్చిన అత్యుత్త‌మ ప్రేమ‌క‌థా చిత్రాల లిస్టు తీస్తే అందులో అగ్ర‌భాగాన ఉండే సినిమా గీతాంజ‌లి. లెజెండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం తెలుగులో తీసిన ఏకైక చిత్ర‌మిది. కానీ ఒక్క సినిమానే చేసినా అది తెలుగు సినీ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోయేలా తీర్చ‌దిద్దాడు. శివ సినిమాతో తిరుగులేని మాస్ ఇమేజ్ సంపాదించిన అక్కినేని నాగార్జున‌ను ఒక క్యాన్స‌ర్ పేషెంట్‌గా చూపించి, హీరోయిన్‌కు కూడా ప్రాణాంత‌క జ‌బ్బు ఉన్న‌ట్లు చూపించి అంత పెద్ద హిట్ ఇవ్వ‌డం అంటే చిన్న విష‌యం కాదు.

ఇలాంటి క‌థ‌ను ఒప్పుకున్న నాగార్జున‌, ఈ సినిమాను నిర్మించిన న‌ర‌సారెడ్డి అభినంద‌నీయులు. ఐతే గీతాంజ‌లి విడుద‌ల‌కు ముందు నిర్మాత న‌ర‌సారెడ్డిని ఒక డిస్ట్రిబ్యూట‌ర్ బాగా ఇబ్బంది పెట్టాడంటూ ఒక షాకింగ్ విష‌యాన్ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ పంచుకోవ‌డం విశేషం. అదేంటంటే..

గీతాంజ‌లి విడుద‌ల‌కు వారం ముందు డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ప్రివ్యూ వేశార‌ట‌. అందులో చాలామంది సినిమా ప‌ట్ల పెద‌వి విరిచార‌ట‌. గుంటూరుకు చెందిన ఓ డిస్ట్రిబ్యూట‌ర్ అయితే.. హీరో క్యాన్స‌ర్ పేషెంట్ ఏంటి.. హీరోయిన్‌కు జ‌బ్బు ఉండ‌డం ఏంటి అని అభ్యంత‌ర పెడుతూ.. సినిమాలో ఇలాంటి నెగెటివ్ విష‌యాల‌కు సంబంధించి నాలుగు ముఖ్య‌మైన స‌న్నివేశాల‌ను ఫైన‌ల్ క‌ట్ నుంచి తీసేయాల‌ని, అప్పుడే తాను డ‌బ్బులు క‌ట్టి సినిమా తీసుకుంటాన‌ని కండిష‌న్ పెట్టాడ‌ట‌. ఐతే ఫైనాన్స్ క్లియ‌ర్ చేయాల్సి ఉండ‌డంతో ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నంకు తెలియ‌కుండా నిర్మాత ఆ సీన్లు తీసేసి అత‌డికి ఫైన‌ల్ కాపీ ఇచ్చాడ‌ట‌. గుంటూరు వ‌ర‌కు సినిమా అలాగే రిలీజైంద‌ట‌.

ఐతే గీతాంజ‌లి రిలీజైన వారానికి గ‌ట్టిగా పుంజుకుని సూప‌ర్ హిట్ట‌యింద‌ని.. కీల‌క స‌న్నివేశాలులేకుండానే గుంటూరులో సైతం హిట్ టాక్ తెచ్చుకుంద‌ని వ‌ర్మ వెల్ల‌డించాడు. ఈ విష‌యం ఆల‌స్యంగా తెలుసుకున్న మ‌ణిర‌త్నం.. రెండో వారం నుంచి అయినా ఆ సీన్లు క‌ల‌ప‌మ‌ని అడిగితే సినిమా ఇక్క‌డ బాగానే ఆడుతోంది క‌దా.. మ‌ళ్లీ కెల‌క‌డం ఎందుక‌ని ఆ డిస్ట్రిబ్యూట‌ర్ ఒప్పుకోలేద‌ని వ‌ర్మ తెలిపాడు.