టాలీవుడ్ మల్టీస్టారర్ సంచలనం ఆర్ఆర్ఆర్ ఊహించిన దానికన్నా చాలా మెరుగ్గా జపాన్ ఓపెనింగ్ తెచ్చుకుంది. ఇండియాలో విడుదలైన ఏడు నెలల తర్వాత ఆ దేశంలో రిలీజవుతున్నప్పటికీ అక్కడి ప్రేక్షకులు ఈ గ్రాండియర్ ని చూసేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ కారణంగానే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కార్తికేయలు కుటుంబాలతో సహా వెళ్ళిపోయి చాలా ఉత్సాహంగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. వాటి తాలూకు వీడియోలు మన సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. చరణ్ ఒక ఇండియన్ స్కూల్ కు వెళ్లడం, తారక్ జపాన్ భాషలో చక్కగా మాట్లాడ్డం లాంటివి వైరల్ అవుతున్నాయి.
ఇక రెస్పాన్స్ విషయాన్ని వస్తే మొదటిరోజు ఆర్ఆర్ఆర్ కు జపాన్ లో వచ్చిన ఫుట్ ఫాల్స్ 8 వేలకు పైగా ఉన్నాయి. గతంలో సాహో 6509 నమోదు చేయగా, బాహుబలి 2 కేవలం 1382కి పరిమితమయ్యింది. అమీర్ ఖాన్ దంగల్ 1265 తో చాలా వెనుకబడి ఉంది. ఈ లెక్కన ట్రిపులార్ నమోదు చేయబోయే సంచలనాలు భారీగా ఉండబోతున్నాయి. కోవిడ్ నిబంధనలు కఠినంగా ఉండటం వల్ల ఆడియన్స్ సైలెంట్ గా చూస్తున్నారు కానీ లేదంటే యుఎస్ బియాండ్ ఫెస్ట్ కి మించిన స్పందన ఇక్కడా వచ్చేదని ఎన్ఆర్ఐల అభిప్రాయం. రెండో రోజు నుంచి ఇంకా ఎక్కువ పికప్ ఉంటుందని చెబుతున్నారు.
అసలే ఆస్కార్ ని టార్గెట్ గా పెట్టుకున్న జక్కన్నకు ఈ పరిణామాలన్నీ మేలు చేసేవే. వరల్డ్ వైడ్ రీచ్ ఏ స్థాయిలో ఉందో అకాడమీ సభ్యులకు అర్థమవుతుంది. పైగా జపాన్ జనాలు మనలాగా ఊర మాస్ కాకపోయినా సినిమా నచ్చితే చాలు వందల కోట్ల వసూళ్లు వర్షంలా కురిపిస్తారు. ఇది ముందే గుర్తించిన రాజమౌళి దానికి తగ్గట్టే పక్కా ప్లాన్ తో తన హీరోలతో సహా అక్కడికి వెళ్లిపోయారు. ట్రేడ్ అంచనా ప్రకారం మొదటి రోజు జపాన్ లెక్క సుమారుగా పాతిక కోట్ల దాకా వచ్చి ఉండొచ్చట. ఇదే రచ్చని చైనాలోనూ చేస్తే ఆర్ఆర్ఆర్ ని బీట్ చేయడం ఇప్పట్లో ఏ భారతీయ సినిమా వల్ల కాదేమో.