రామ్ చరణ్ టు విజయ్ దేవరకొండ

మళ్ళీ రావా అనే చిన్న సినిమాతో అరంగేట్రంలోనే అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. మార్కెట్ దెబ్బ తిని, ఫాంలో కోల్పోయిన సుమంత్‌తో చేయడం వల్ల ఆ సినిమా కమర్షియల్‌గా అనుకున్న స్థాయిలో ఆడలేదు కానీ.. పేరున్న హీరోతో చేసి ఉంటే చాలా పెద్ద హిట్టయ్యేదేమో. అయినా సరే ఓటీటీలో ఆ సినిమా చూసిన వాళ్లంతా క్లాసిక్‌గా అభివర్ణించారు.

ఇక తనపై పెరిగిన అంచనాలను గౌతమ్ రెండో సినిమాతో బాగానే అందుకున్నాడు. నానితో ‘జెర్సీ’ లాంటి క్లాసిక్‌ను డెలివర్ చేశాడు. కాకపోతే ఈ సినిమా హిందీలో మాత్రం నిరాశపరిచింది. దానికీ గౌతమే దర్శకుడు. ఈ సినిమా చేస్తుండగానే రామ్ చరణ్‌తో పని చేసే అవకాశం దక్కింది గౌతమ్‌కు. వీరి కలయికలో సినిమాను అధికారికంగానే ప్రకటించారు. కానీ చాలా టైం తీసుకుని గౌతమ్ రెడీ చేసిన కథ చరణ్‌కు నచ్చలేదు. బహుశా ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మారిన తన ఇమేజ్‌కు ఈ కథ సరిపోదని చరణ్ భావించి ఉంటాడని అంటున్నారు.

ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు అధికారిక ప్రకటన ఏమీ రాలేదు కానీ.. చరణ్ కాంపౌండ్ నుంచి గౌతమ్ బయటపడ్డ మాట మాత్రం వాస్తవం. ఐతే గౌతమ్ చరణ్ కోసం రెడీ చేసిన కథనే మరో హీరోతో చేయడానికి రెడీ అయినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘లైగర్’తో గట్టి ఎదురు దెబ్బ తిన్న విజయ్‌.. గౌతమ్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయినట్లు సమాచారం.

గౌతమ్-చరణ్‌ల సినిమాను నిర్మించాల్సిన ఎన్వీ ప్రసాదే ఈ చిత్రాన్ని టేకప్ చేయడానికి ముందుకు వచ్చాడట. విజయ్‌కి చెప్పింది చరణ్ కోసం తయారు చేసిన కథే అని.. చరణ్ ప్రస్తుత ఇమేజ్‌కు అది సెట్ అవ్వదనే తప్ప, కథలో లోపమేమీ లేదన్న అభిప్రాయంతోనే ఆ కాంబినేషన్ కుదరలేదని.. కొంచెం క్లాస్ టచ్ ఉన్న ఈ కథ విజయ్‌కి పర్ఫెక్ట్‌గా సూటవుతుందని అంటున్నారు. ప్రస్తుతం ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్న విజయ్.. దాని తర్వాత గౌతమ్ సినిమానే పట్టాలెక్కిస్తాడని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై క్లారిటీ రావచ్చు.