టాలీవుడ్లో చాలా పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. అనుకున్న స్థాయిలో నిలదొక్కుకోలేక ఇబ్బంది పడుతున్నారు మంచు ఫ్యామిలీ వారసులు. ఒక దశలో మంచు విష్ణు, మంచు మనోజ్ అడపా దడపా బాగానే హిట్లు ఇచ్చారు కానీ.. గత కొన్నేళ్లలో వారి సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. దీంతో వాళ్ల కెరీర్లో గ్యాప్ వచ్చింది. మంచు మనోజ్ అయితే నాలుగైదేళ్లుగా కొత్త సినిమా సంగతే తేల్చట్లేదు.
మంచు విష్ణు మాత్రం మళ్లీ యాక్టివ్ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు. చకచకా జిన్నా అనే సినిమా చేశాడు. అది విడుదలకు సిద్ధం అవుతోంది. ఆ తర్వాత చేయాల్సిన సినిమాలకు సంబంధించి డిస్కషన్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర ప్రాజెక్టు గురించి సమాచారం బయటికి వచ్చింది. మలయాళంలో సూపర్ హిట్టయిన ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్’ అనే వెరైటీ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని మంచు విష్ణు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
మలయాళంలో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్’ ఒకటి. ఇందులో వయసు మళ్లిన తండ్రి కోసం విదేశాల నుంచి అతడి కొడుకు ఒక రోబోను పంపిస్తాడు. దాంతో ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయిపోయిన తండ్రి.. చివరికి దాన్ని వదులుకోలేక పడే తపన.. ఈ క్రమంలో ఒక ఆసక్తికర ముగింపుతో సినిమా ఆశ్చర్యపరుస్తుంది. ఇందులో తండ్రి పాత్రను మోహన్ బాబుతో చేయించి కొడుకు క్యారెక్టర్లో మంచు విష్ణు కనిపించనున్నాడ.
ఆల్రెడీ తమిళంలోనూ ఈ చిత్రం రీమేక్ అయి మంచి ఫలితాన్నే అందుకుంది. మోహన్ బాబు స్థాయికి తగని పాత్రల్లో ఆయన్ని చూసి నిరాశ చెందిన అభిమానులకు ఇది కచ్చితంగా మంచి న్యూసే. ఆయనకు ఈ పాత్ర కచ్చితంగా వైవిధ్యంగా ఉంటుంది. ఆయనలోని నటుడికి మంచి స్కోప్ ఇచ్చే పాత్ర అవుతుందిది. విష్ణుకు కూడా ఇదొక భిన్నమైన సినిమా అవుతుంది. ఇలాంటి సెన్సిబుల్ మూవీస్ చేయకే మంచు వారు గాడి తప్పారని చెప్పాలి. మరి ఈ చిత్రాన్ని తెలుగులో ఎంత బాగా తీసి మెప్పిస్తారో చూడాలి.