అదేంటో కాని, చాలాసార్లు సినిమా కష్టపడి తీసిన దర్శకులే హిట్లకూ ఫ్లాపులకూ బలైపోతుంటారు. ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఏకంగా కొరటాల శివ పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఎన్టీఆర్ తదుపరి సినిమా కోసం పనిచేస్తున్నాడు. పుష్ప సినిమా వచ్చి హిట్టయ్యి సంవత్సరానికి కాస్త దగ్గర్లో ఉన్న సమయంలో కూడా ఇంకా రెండో పార్టు తాలూకు స్ర్కిప్టును చెక్కుతున్నాడు సుకుమార్. కాని కొంతమంది డైరక్టర్లు మాత్రం.. ఫ్లాపులు తీసినా కూడా తమకేం పట్టనట్లు తరువాతి సినిమావైపు వెళ్ళిపోతారు. ఇప్పుడు అలాంటి ఒక దర్శకుడి గురించే ఈ డిస్కషనంతా.
కెజిఎఫ్ అండ్ విక్రమ్ రేంజులో తన సినిమా కూడా ఒక టాప్ బ్లాక్ బస్టర్ అవుతుంది ఎన్నో హోప్స్ పెట్టుకున్న అక్కినేని నాగార్జునకు ‘ది ఘోస్ట్’ సినిమాతో గట్టి దెబ్బేతగిలింది. బాక్సాఫీస్ దగ్గర సినిమా క్లీన్ బౌల్డ్ అయిపోవడంతో ఇప్పుడు నాగ్ కూడా చాలా డిజప్పాయింట్ అయ్యాడట. వాస్తవానికి ఒక సినిమా ఫ్లాప్ అయితే దర్శకులు ఇంకా ఫీలైపోయి కొన్నాళ్ళు సైలెంట్ అయిపోతారు. కాని ఈ సినిమాను తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాత్రం, అసలు ‘ది ఘోస్ట్’ సినిమా విడుదలై ఇంకా వారం కూడా కాలేదు, ఐపిఎల్ ప్లేయర్లు టీమ్ మారినట్లు అప్పుడే తరువాతి సినిమా టీంలోకి జంపైపోయాడు. జస్ట్ వెళ్లిపోవడమే కాదు, ఏకంగా మెగా హీరో వరుణ్ తేజ్ తో షూటింగ్ కూడా మొదలెట్టేశాడు. ఏంటి సినిమా ఫ్లాపైందిగా ఈయనకి మినిమం బాధ కూడా లేదా అనే సందేహం వచ్చేస్తోంది కదూ?
ఈ సినిమాను తీస్తున్నప్పుడు కథ మరియు కథనం విషయంలో నాగార్జున చాలా సలహాలు ఇచ్చారట. ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయ్యేసరికి అంతా ఆయనే చేశారు అన్న చందాన ప్రవీణ్ సత్తారు తన దారి తాను చూసుకున్నాడు. గతంలో ఈయన నెట్ ఫ్లిక్స్ వాళ్ళకు బాహుబలి బిఫోర్ ది బిగినింగ్ వెబ్ సిరీస్ తీశాక కూడా.. తీసిందంతా బాలేదు అనగానే అక్కడి నుండి జంప్ అయిపోయాడు. తనకున్న నెరేషన్ సత్తాతో సినిమాలను బాగానే పట్టేస్తున్న సత్తారు, ప్రొడక్ట్ ఫ్లాప్ అయినప్పుడు బాధ్యత తీసుకుంటే బాగుంటుంది. కూర్చుని బాధపడమని చెప్పట్లేదు కాని, ఒకసారి ఆగి తప్పులు ఎక్కడ జరిగాయో ఆత్మపరిశీలన చేసుకున్న తరువాత మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే బెటరేమో కదా. పైగా వరుణ్ తేజ్ తో కూడా మళ్లీ అవే గన్నులూ చేజులూ ఫైట్లు. అది సంగతి!