బ్రహ్మ జోరుకు సోమవారం బ్రేకు

చేయాల్సిన స్థాయిలో ప్రమోషన్లు జరక్కపోయినా, మెగాస్టార్ రేంజ్ లో హడావిడి కనిపించకపోయినా పాజిటివ్ టాక్ తో మొదటి అయిదు రోజులు మంచి వసూళ్లు దక్కించుకున్న గాడ్ ఫాదర్ మీద ఫ్యాన్స్ భయపడినట్టే మండే పిడుగు పడింది. నిన్నటి నుంచి చాలా సెంటర్లలో ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన నగరాలు, పట్టణాలు మినహాయించి మిగిలిన చోట్ల హాళ్లు సగమే నిండాయని ఎగ్జిబిటర్స్ రిపోర్ట్. సాధారణంగా ఏ సినిమాకైనా ఇది సహజంగా జరిగేదే. కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటి ఎక్స్ ట్రాడినరీ టాక్ వచ్చిన వాటికి మాత్రమే వీక్ డేస్ బలంగా ఉంటాయి.

కానీ గాడ్ ఫాదర్ విషయంలో అలా జరగడం లేదు. ఎవరూ నెగటివ్ గా మాట్లాడకపోయినా సీరియస్ పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తిగా బయటికి రాలేదన్నది అర్థమవుతోంది. అయినప్పటికీ ఇప్పటిదాకా 50 కోట్లకు పైగా షేర్ రాబట్టడం అంటే చిన్న విషయం కాదు. మాములుగా అయితే థియేట్రికల్ బిజినెస్ తక్కువగా జరిగి ఉంటే ఈ మొత్తం బ్లాక్ బస్టర్ కిందే లెక్క. కానీ 91 కోట్లకు బ్రేక్ ఈవెన్ పెట్టుకోవడంతో టార్గెట్ కాస్తా కొండంతగా మారిపోయింది. ఇంకో నలభై కోట్లు రావడం అంటే మాటలు కాదు. ఏదో అద్భుతం జరగాల్సిందే.

రెస్పాన్స్ పరంగా చూసుకుంటే ఆచార్య కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా పెర్ఫార్మ్ చేసిన మాట వాస్తవం. ఇప్పుడు రాబోయే పది రోజులు గాడ్ ఫాదర్ కు చాలా కీలకం కాబోతున్నాయి. ఈ వారం పెద్దగా చెప్పుకోదగ్గ చిత్రాలేవీ లేవు. 21న దీపావళికి మాత్రం గట్టి హడావిడి ఉంటుంది. జిన్నా, సర్దార్, ఓరి దేవుడా, ప్రిన్స్, బ్లాక్ ఆడమ్ లు వచ్చాక స్క్రీన్ కౌంట్ గణనీయంగా తగ్గిపోతుంది. 15న శాండల్ వుడ్ సెన్సేషన్ కాంతారను తెస్తున్నారు. ఇది మన ప్రేక్షకులకు కనెక్ట్ అయితే అదో దెబ్బ పడుతుంది. సో ఎలా చూసుకున్న ఇప్పుడొచ్చే ఆదివారం దాకా ఎంత రాబట్టుకుంటే దాదాపు అవే ఫైనల్ ఫిగర్స్ అవొచ్చు.