ప్రిన్స్: మొత్తం తమిళ బ్యాచే

జాతిరత్నాలుతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అనుదీప్ కొత్త సినిమా ప్రిన్స్ ఈ నెల 21 దీపావళి కానుకగా విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ కూడా వచ్చేసింది. ముందు నుంచి బైలింగ్వల్ అంటూ ప్రచారం చేశారు కానీ వరస చూస్తుంటే డబ్బింగ్ సినిమాలాగే అనిపిస్తోంది. ముఖ్యంగా శివ కార్తికేయన్ లిప్ సింక్, ఒకరిద్దరు తప్ప మొత్తం తమిళ బ్యాచే ఉండటం పలు అనుమానాలకు చోటిస్తున్నాయి. చెప్పుకోదగ్గ పెద్ద బడ్జెట్ తోనే దీన్ని తెరకెక్కించారు. తమన్ సంగీతం, సత్యరాజ్ లాంటి పెద్ద క్యాస్టింగ్ టైపు ఆకర్షణలు చాలానే ఉన్నాయి. స్టోరీ కూడా వెరైటీగా ఉంది.

ఒక స్కూల్ టీచర్ తన ఊరు కులం కట్టుబాట్లు ఆచారాలకు వ్యతిరేకంగా ఒక బ్రిటిష్ పిల్లను ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకుంటానంటాడు. దీంతో అందరూ భగ్గుమంటారు. అయితే ఇదంత సీరియస్ టోన్ లో సాగదు. అనుదీప్ మొత్తం ఎంటర్ టైన్మెంట్ దట్టించి కమర్షియల్ మసాలాలు జోడించాడు. ఒకటి రెండు తప్ప జోకులు మరీ హిలేరియస్ గా అనిపించలేదు కానీ మొత్తం సినిమా చూశాక కానీ ఒక అభిప్రాయానికి రాలేం. ఇక కథలో ఉన్న మెయిన్ పాయింట్ అనుదీప్ చాలా తెలివిగా గత సినిమాల నుంచి తీసుకున్నా అది ఫ్లాష్ కాకుండా జాగ్రత్త పడాలని చూశాడు.

ఓ భారతీయుడు ఇలా బ్రిటిష్ అమ్మాయిని లవ్ చేయడం ఇటీవలే ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒలీవియా మోరిస్ ఎపిసోడ్ లో చూశాం. లగాన్ లో అమీర్ ఖాన్ చేసింది కూడా ఇదే. కాకపోతే ఆ వ్యవహారం పెళ్లి దాకా వెళ్లకుండా ప్రేయసి గ్రేసి సింగ్ ఉంటుంది. జంధ్యాల పడమటి సంధ్యారాగంలో ఈ ట్రాక్ రివర్స్ లో ఉంటుంది. విజయశాంతి ఇంగ్లీష్ కుర్రాడిని ప్రేమిస్తుంది. రాఘవేంద్రరావు కొత్త వాళ్ళతో తీసిన పరదేశిలోనూ ఈ బ్యాక్ డ్రాప్ ని చూడొచ్చు. సో అనుదీప్ తీసుకున్నది మరీ కొత్తది ఎప్పుడూ రానిది కాదు కానీ తన మార్కు పంచుల కామెడీ ఏమేరకు నవ్విస్తాడో చూడాలి. అసలే ఈ మధ్య అతను రచన చేసిన ఫస్ట్ డే ఫస్ట్ షో పెద్ద షాక్ ఇచ్చింది.