ఆ సినిమా ప్ర‌భాస్ చేసి ఉంటే..


మోహ‌న్ రాజా.. మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాద‌ర్ సినిమా తీసి ప్ర‌శంస‌లందుకుంటున్న ద‌ర్శ‌కుడిత‌ను. అత‌ను సీనియర్ ఎడిటర్, నిర్మాత, తెలుగువాడు అయిన మోహన్ కొడుక‌న్న సంగ‌తి తెలిసిందే. మోహ‌న్ రాజా కెరీర్లో చాలా వ‌ర‌కు రీమేక్‌లే ఉన్నాయి. తెలుగులో అత‌డి తొలి చిత్రం హ‌నుమాన్ జంక్ష‌న్ ఓ మ‌ల‌యాళ హిట్ ఆధారంగా తెర‌కెక్క‌గా.. ఆ త‌ర్వాత అత‌ను త‌మిళంలో వ‌రుస‌గా రీమేక్ సినిమాలు చేశాడు.

తెలుగులో విజ‌య‌వంతం అయిన జ‌యం, అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వ‌ర్షం, ఆజాద్.. ఇలా చాలా సినిమాలే రీమేక్ చేశాడ‌త‌ను. ఐతే త‌న సొంత క‌థ‌తో త‌న త‌మ్ముడు హీరోగా అత‌ను తీసిన‌ త‌నీ ఒరువ‌న్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అయి అత‌డి పేరు మార్మోగేలా చేసింది. ఆ త‌ర్వాత త‌న క‌థ‌తోనే వేలైక్కార‌న్‌తో మ‌రో హిట్ కొట్టాడు.

మోహ‌న్ రాజా కెరీర్‌ను మ‌లుపు తిప్పిన త‌నీ ఒరువ‌న్‌ను అత‌ను త‌న త‌మ్ముడు జ‌యం ర‌వితో కాకుండా మ‌న ప్ర‌భాస్‌తో తీయాల్సింద‌ట‌. ఈ విష‌యాన్ని ఒక ఇంట‌ర్వ్యూలో స్వ‌యంగా మోహ‌న్ రాజానే వెల్ల‌డించాడు. 2010 ప్రాంతంలో తాను నిర్మాత భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ ద్వారా ప్ర‌భాస్‌ను క‌లిసి త‌నీ ఒరువ‌న్ క‌థ చెప్పిన‌ట్లు మోహ‌న్ రాజా వెల్ల‌డించాడు. ఆ క‌థ ప్ర‌భాస్‌కు న‌చ్చింద‌ని, ఐతే అప్పుడు కేవ‌లం ఔట్ లైన్ మాత్ర‌మే చెప్పాన‌ని రాజా వెల్ల‌డించాడు. కాగా ప్ర‌భాస్ అప్పుడు ఇలాంటి యాక్ష‌న్ మూవీ కాకుండా త‌న‌తో ఒక ఫ్యామిలీ క‌థ చేయాల‌ని ఆశించిన‌ట్లు తెలిపాడు. దీంతో మ‌రో క‌థ మీద వ‌ర్క్ చేయ‌డానికి తాను సిద్ధ‌మ‌య్యాన‌ని.. కానీ అంత‌లోనే త‌మిళంలో విజ‌య్‌తో ఓ సినిమా కోసం అడ‌గ‌డంతో దాని కోసం వెళ్లిపోయిన‌ట్లు రాజా తెలిపాడు.

ఆ త‌ర్వాత ప్ర‌భాస్‌తో సినిమా కుద‌ర‌లేద‌ని.. 2015లో రామ్ చ‌ర‌ణ్‌తో త‌నీ ఒరువ‌న్ రీమేక్ ధృవ‌ను తానే డైరెక్ట్ చేస్తాన‌ని స్వ‌యంగా అడిగాన‌ని.. ఐతే అప్పటికే సురేంద‌ర్ రెడ్డిని ఓకే చేయ‌డంతో త‌న‌కు అవ‌కాశం రాలేద‌ని, భ‌విష్య‌త్తులో చ‌ర‌ణ్‌తో ధృవ‌-2 చేస్తాన‌ని మోహ‌న్ రాజా తెలిపాడు.