RRR ఆస్కార్ – తగ్గేదేలే

ఆరు నెలల తర్వాత కూడా దేశ విదేశాల ప్రముఖులు, ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుకుంటూనే ఉన్న ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వచ్చే ఏ అవకాశాన్ని వదిలిపెట్టేందుకు రాజమౌళి బృందం సిద్ధంగా లేదు. ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా గుజరాతి మూవీ వెళ్లడంతో ఇప్పుడు జక్కన్న టీమ్ జెనరల్ క్యాటగిరీని టార్గెట్ చేసుకుంది. ఇటీవలే ప్రపంచపు అతి పెద్ద ఐమాక్స్ థియేటర్ లో బియాండ్ ఫెస్ట్ పేరుతో నిర్వహించిన స్పెషల్ ప్రీమియర్ కు యుఎస్ ప్రేక్షకుల నుంచి వచ్చిన అపూర్వ స్పందన జక్కన్నను ఉక్కిరిబిక్కిరి చేసింది. వాటి తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి.

ఒకటి రెండు కాదు ఏకంగా 15 విభాగాల్లో ఆర్ఆర్ఆర్ కోసం అప్లికేషన్ పెట్టారు. బెస్ట్ మోషన్ పిక్చర్, డైరెక్టర్, యాక్టర్, ఒరిజినల్ సాంగ్, స్క్రీన్ ప్లే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్, సౌండ్, సపోర్టింగ్ యాక్ట్రెస్, సపోర్టింగ్ యాక్టర్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్, మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్, విజువల్ ఎఫెక్ట్స్ క్యాటగిరీలలో అకాడెమి కమిటీ ముందు ట్రిపులార్ తన సత్తాను చూడమని అడుగుతోంది. వీటిలో ఎక్కువగా అవకాశాలున్నది దర్శకుడు, కథనం, ఛాయాగ్రహణంకేనని నిపుణుల అభిప్రాయం. దేనికి వచ్చినా అది టాలీవుడ్ కు గర్వకారణమేనని వేరే చెప్పాలా.

ఇప్పుడీ పనుల మీదే రాజమౌళి రెండు నెలల పాటు అమెరికాలో మకాం వేయబోతున్నట్టు తెలిసింది. మహేష్ బాబు ఎలాగూ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు. తనతో చేయాల్సిన సినిమా తాలూకు స్క్రిప్ట్ పనులను విజయేంద్ర ప్రసాద్ టీమ్ ఇక్కడే చేస్తోంది. సో ఈ సమయాన్ని పూర్తిగా ఆస్కార్ కోసమే వినియోగించేలా ప్లాన్ చేసుకున్నారట. మధ్యలో ఏ దేశంలో ఎక్కడ ఆర్ఆర్ఆర్ షోలు వేసినా దానికి రాజమౌళి హాజరై జనాల మద్దతు కోరబోతున్నాడు. బాహుబలికి సైతం సాధ్యం కానీ ఖ్యాతిని ఆర్ఆర్ఆర్ కు వచ్చేందుకు జరుగుతున్న కృషి అభినందనీయమే. దానికి తగ్గ ఫలితం దొరికితే అంతకన్నా కావాల్సింది ఏముంది