వివాదాలతో కోట్ల రూపాయల పబ్లిసిటీ

కేవలం నాలుగు రోజుల క్రితం విడుదలైన ఆది పురుష్ టీజర్ రోజుకో వివాదాన్ని తీసుకొచ్చి కోట్ల రూపాయల ఫ్రీ పబ్లిసిటీని ఎంచక్కా చేసుకుంటోంది. గ్రాఫిక్స్ లో క్వాలిటీ మీద సోషల్ మీడియా విరుచుకుపడినప్పటికీ తాను మొబైల్ ఫోన్ కోసం సినిమా తీయలేదని దర్శకుడు ఓం రౌత్ సమర్ధించుకోవడం ఇప్పటికే మిస్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. రావణుడి గెటప్ మీద బిజెపి నాయకుడు ఒకరు ఆల్రెడీ కోర్టు కేసుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. రాముడిని సాంప్రదాయ వేషధారణకు భిన్నంగా గెటప్ డిజైన్ చేయడం పట్ల, మీసాల నుంచి బాణాల దాకా ఎన్నో అంశాల గురించి కామెంట్లు వచ్చిపడుతున్నాయి.

ఇక హనుమాన్ పాత్రధారి ముసల్మాన్ లా ఉన్నాడని ఒకరు, అసలు అసంబద్దంగా ఉన్న ఇలాంటి పాత్రలతో ఉన్న ఆది పురుష్ ని బ్యాన్ చేయాలని ఏకంగా అయోధ్య రామాలయం పూజారి ఒకరు పిలుపునివ్వడం రచ్చని ఇంకెక్కడికో తీసుకెళ్లేలా ఉంది. ఉప్పుకు నిప్పు తోడైనట్టు అజయ్ దేవగన్ కు చెందిన విఎఫ్ఎక్స్ కంపనీ దీని విజువల్ ఎఫెక్ట్స్ మేము చేయలేదని ఎవరూ అడగకుండానే వివరణ ఇవ్వడం మీడియాని సైతం విస్మయపరిచింది. ఇలా ఏదో ఒక రూపంలో ప్రభాస్ మూవీ హాట్ టాపిక్ గా నలుగుతూనే ఉంది. ట్విస్ట్ ఏంటంటే త్వరలో టీజర్ త్రీడి వెర్షన్ ని ప్రధాన నగరాల్లో థియేట్రికల్ గా రీ లాంచ్ చేస్తారట.

ఈ కాంట్రావర్సీల సంగతి ఎలా ఉన్నా ఇదంతా మంచికే అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. విడుదలకు కేవలం మూడు నెలల టైం మాత్రమే ఉంది. తొంభై రోజుల్లో ప్యాన్ ఇండియా లెవెల్ లో హైప్ ని ఎక్కడికో తీసుకెళ్లాలి. సంక్రాంతి పోటీని తట్టుకుని ఇదే బెస్ట్ ఆప్షన్ అనిపించేలా జనాల మైండ్ సెట్ ట్యూన్ చేయాలి. యూనిట్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగక ముందే ఇలాంటి ఇష్యూస్ వల్ల ఆది పురుష్ గురించి చర్చ జరుగుతూనే ఉంటే కామన్ పబ్లిక్ లో దీన్నుంచి దృష్టి పక్కకు వెళ్లకుండా ఉంటుంది. అందుకే ఇదంతా నెగటివ్ గా జరుగుతున్నా సరే ట్రైలర్ టైంకంతా సర్దుకుని అంచనాలు పెంచేస్తుందని అభిమానుల నమ్మకం. చూద్దాం!