గాడ్ ఫాదర్ ..మార్పులు కలిసొచ్చాయి

లూసిఫర్ చూసిన వెంటనే చిరంజీవికి అందులో కొన్ని మైనస్ లు కనిపించాయి. తెలుగులో రీమేక్ చేసే ముందు వాటిని సరి చేసి ఆ లోపాలు లేకుండా చూసుకోవాలని భావించారు. ఈ విషయాన్ని ఇటివల ప్రెస్ మీట్ లో ఆయనే స్వయంగా చెప్పారు. సరిగ్గా చిరుకి నచ్చే మార్పులతో తన స్క్రీన్ ప్లే పట్టుకొని మోహన్ రాజా వెళ్లేసరికి మరో మాట ఆలోచించకుండా మెగాస్టార్ మెగా రీమేక్ ను తమిళ్ దర్శకుడి చేతిలో పెట్టేశాడు. అయితే నిజంగానే మోహన్ రాజా చేసిన మార్పులు గాడ్ ఫాదర్ కి ప్లస్ అయ్యాయి.

మొదటి మార్పు తమ్ముడి పాత్ర లేపేయడం. లూసిఫర్ లో మోహన్ లాల్ కి ఓ తమ్ముడు ఉంటాడు. అతని పాత్రతో దర్శకుడు పృథ్వీరాజ్ పొలిటికల్ డ్రామా నడిపించాడు. ఆ పాత్ర చుట్టూ పొలిటికల్ స్పీచ్ లు, భారీ సభలు ఇలా చాలా తతంగం ఉంటుంది. ఆ పాత్ర తాలూకు సన్నివేశాలు ఒరిజినల్ లో కాస్త బోర్ కొట్టిస్తాయి. అందుకే గాడ్ ఫాదర్ లో ఆ పాత్ర తొలగించి నయనతార పాత్రకి ఇంపార్టెన్స్ పెంచారు. దీంతో తెలుగు వర్షన్ లో హీరో చెల్లెలి పాత్ర ఇంకాస్త హైలైట్ అయింది.

ఇక లూసిఫర్ కి మరో పెద్ద మైనస్ రన్ టైం. అవును ఒరిజినల్ సినిమా రెండు గంటల నలబై నిమిషాలకు పైనే ఉంటుంది. థియేటర్స్ లో సినిమా కాస్త బోర్ కొట్టడానికి ఎక్కువ రన్ టైం కారణమని చెప్పొచ్చు. ఓటీటీ లో ఫార్వార్డ్ ఆప్షన్ ఉంది కనుక బోర్ కొట్టినప్పుడల్లా ముందుకు జరపవచ్చు కానీ థియేటర్స్ లో ఆ పరిస్థితి లేదు కనుక తెలుగు వర్షన్ నిడివి తగ్గించేశారు. అసలు బోర్ కొట్టించే పాత్ర లేపేయడంతో గాడ్ ఫాదర్ ని మార్తాండ్ కే వెంకటేష్ పర్ఫెక్ట్ రన్ టైం కి కట్ చేసి ఇచ్చారు.

అలాగే ఒరిజినల్ లో పృథ్వీ రాజ్ సుకుమారన్ పాత్ర చివర్లో వస్తుంది. గాడ్ ఫాదర్ లో ఆ పాత్రను సల్మాన్ ఖాన్ చేయడంతో ఆ పాత్ర నిడివి పెంచి మరో రెండు మూడు సన్నివేశాలు యాడ్ చేశారు. సల్మాన్ ఖాన్ పాత్ర సాధారణ జనాలకు అంతగా ఎక్కలేదు కానీ అభిమానులకు మాత్రం కిక్ ఇచ్చింది. ఫైనల్ గా ఒకటికి రెండు సార్లు చూసి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఫిగర్ పెంచేది అభిమానులే కాబట్టి ఇది కూడా గాడ్ ఫాదర్ కి కలిసొచ్చిన మార్పే. ఇలా మోహన్ రాజా అండ్ టీం గాడ్ ఫాదర్ కి చేసిన మార్పులు ప్రేక్షకులను అలరిస్తూ ఆకట్టుకుంటున్నాయి. మరి దసరా బరిలో నిలిచిన ఈ మెగా మూవీ ఓవరాల్ గా ఎంత కలెక్ట్ చేస్తుందో ఎలాంటి మేజికల్ ఫిగర్స్ చూపిస్తుందో చూడాలి.