మొన్ననే కదా మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్.. తాను వెబ్ సిరీస్‌ల్లో నటించబోనని, అవి చేస్తే సినిమా అవకాశాలు లేవనుకుంటారని, తన లాంటి యువ కథానాయకులకు వెబ్ సిరీస్‌లు నష్టమే చేస్తాయని అన్నది.. అంతలోనే వెబ్ సిరీస్ ఒప్పుకోవడం ఏంటి అని ఆశ్చర్యం కలుగుతోందా? ఐతే ఇప్పుడు వెబ్ సిరీస్ చేయబోతోంది చిరు చిన్న అల్లుడు కాదు. పెద్ద అల్లుడు.
చిరు పెద్ద కూతురు సుస్మితతో కలిసి ఆమె భర్త విష్ణు ప్రసాద్ ఓ వెబ్ సిరీస్ నిర్మించడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. వీళ్లిద్దరూ కలిసి ఓ వెబ్ ిసిరీస్ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు ఈ మధ్యే వార్తలొచ్చాయి. దాన్ని నిజం చేస్తూ కొత్తగా బేనర్ కూడా మొదలుపెట్టారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే కొత్త బేనర్ మీద ఈ జంట ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించనుంది. కొన్ని నెలల పాటు ప్రి ప్రొడక్షన్ పనులు చేశాక ఆ వెబ్ సిరీస్‌ను పట్టాలెక్కిస్తున్నారు.
‘ఓయ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత కనిపించకుండా పోయిన ఆనంద్ రంగా.. చిరు కూతురు, అల్లుడు నిర్మించబోయే వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నాడు. ఇంకా ఈ సిరీస్‌కు పని చేసే నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు వెల్లడించలేదు. స్క్రిప్టు రెడీ అయిందని.. కరోనా ప్రభావం కొంచెం తగ్గాక షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. పరిమిత బడ్జెట్లో కాన్సెప్ట్ బేస్డ్ వెబ్ సిరీస్‌గా దీన్ని తీర్చిదిద్దబోతున్నారట.
విష్ణు ప్రసాద్ వ్యాపారవేత్త కాగా.. సుస్మిత సినిమాల్లోనే కొనసాగుతోంది. ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన ఆమె.. కాస్ట్యూమ్ డిజైనర్‌గా మారింది. చిరంజీవి రీఎంట్రీ తర్వాత ప్రతి సినిమాకూ ఆమే కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తోంది. చిరు కొత్త సినిమా ‘ఆచార్య’కూ సుస్మితనే కాస్ట్యూమ్స్ సమకూరుస్తోంది. తమ తొలి వెబ్ సిరీస్ వ్యవహారాలన్నీ సుస్మితనే చూసుకోబోతున్నట్లు సమాచారం.