నాగ్ మార్కెట్ పెరగలేదా? పెంచలేదా?

‘ది ఘోస్ట్’ సినిమాతో దసరా సందర్భంగా తన సత్తా చూపించడానికి విచ్చేస్తున్నారు అక్కినేని నాగార్జున. అయితే ఈ సీనియర్ హీరో తనకు కాంటెపరరీ అయిన మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాతో తలపడడమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాకపోతే అటు మెగాస్టార్ సినిమాకు ఒక రేంజులో బుకింగ్స్ ఉంటే, ఇప్పుడు నాగ్ సినిమాకు మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ నార్మల్ గానే ఉన్నాయ్. అంతేకాదు, నాగ్ సినిమాకు వచ్చిన ధియేట్రికల్ రైట్స్ వసూళ్ళు చూస్తే మాత్రం.. అసలు ఈ సీనియర్ హీరో మార్కెట్ ఏమైంది అనే సందేహం రాకమానదు.

సినిమాలకు తిరిగొచ్చి ఖైదీ నెం 150తో ఆడియన్స్ ను పలకరించినప్పటి నుండి, మెగాస్టార్ సినిమాలకు కనీసం 100 కోట్ల ధియేట్రికల్ సేల్స్ బిజినెస్ అనేది అలవోకగా అయిపోతోంది. ఆచర్యను 140 కోట్లకు అమ్మిన ప్రొడ్యూసర్లు, ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాను 95+ కోట్లకు అమ్మేశారు. ఇదే సమయంలో వస్తున్నది ఘోస్ట్ మాత్రం కేవలం 26 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందంటే కాస్త షాకవ్వాల్సిందే. నాగార్జున గత సినిమా బంగార్రాజు 34 కోట్లు వసూలు చేసినా కూడా, ఎందుకో ఘోస్ట్ బిజినెస్ మాత్రం చాలా తక్కువే అయ్యింది. అయితే నాగ్ తన మార్కెట్ ను పెంచుకోవట్లేదా లేదంటే ఆయన మార్కెట్ పెరగట్లేదా అనేది ఇప్పుడు అందర్నీ చర్చకు గురిచేస్తున్న విషయం.

నిజానికి నాగ్ సినిమాకు హిట్ టాక్ వస్తే ఏ రేంజు కలక్షన్లు వస్తాయ్ అనేది ఇప్పుడు చెప్పలేం కాని, ఆయన మాత్రం తన మార్కెట్ పెరిగే విధంగా సినిమాలను ప్లాన్ చేసుకోవట్లేదనే చెప్పాలి. ఒక ప్రక్కన రకుల్ ప్రీత్ వంటి హీరోయిన్ ను పెట్టుకుని, ఇంకా కుర్రకారు తరహాలో మన్మథుడు 2 అని చేస్తే జనాలు రిజక్ట్ చేశారు. అప్పటికే ఆఫీసర్, రాజు గారి గది మరియు దేవదాస్ వంటి సినిమాలు ఆయన మార్కెట్ ను భారీగా పాడుచేశాయ్. ఆ తరువాత వచ్చిన వైల్డ్ డాగ్ సినిమా కూడా ఆయనకు చాలా కీడే చేసింది. బహుశా అందువలనేనేమో, ఒక ప్రక్కన చిరంజీవి-బాలయ్య మార్కెట్ ఈజీగా 70 కోట్ల రేంజ్ కు వెళిపోతే, నాగ్ మార్కెట్ మాత్రం డౌన్ అయిపోయింది.

అయితే ‘ది ఘోస్ట్’ సినిమా ఆయనకు ఒక పెద్ద ఛాన్స్ అనే చెప్పాలి. ఒకవేళ సినిమా ఏమాత్రం కమల్ హాసన్ ‘విక్రమ్’ తరహాలో ఉంటే మాత్రం, కలక్షన్లు అవే పెరిగిపోతాయ్. కాస్త డిఫరెంటుగా అనిపించినా కూడా, ఒక 50 కోట్ల షేర్ రాబట్టడం అనేది సులువైపోతుంది. అలాంటి మ్యాజిక్ తో నాగ్ తన మార్కెట్ ను పెంచుకుని, దాన్ని నిలబెట్టుకునేలా తదుపరి సినిమాలు ప్లాన్ చేసుకుంటే, నాగ్ కూడా నువ్వా నేనా అనే రేంజులో తన కాంటెపరరీ హీరోలకు పోటీనివ్వొచ్చు.