మహేష్ సినిమాపై జక్కన్న మళ్లీ..


ఇప్పుడు ఇండియా చూపే కాదు.. ప్రపంచం చూపు కూడా రాజమౌళి తర్వాతి సినిమా మీద ఉంది. ‘ఆర్ఆర్ఆర్’తో ఆయన రేంజ్ అలా పెరిగిపోయింది మరి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో జక్కన్న తర్వాతి సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ కోసం అభిమానులు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. జక్కన్న కీర్తి ప్రపంచం నలుమూలలా చేరి ఆయన మార్కెట్ అసాధారణ స్థాయికి విస్తరించిన సమయంలో ఆయనతో సినిమా చేయబోతుండడం ఒక రకంగా మహేష్ అదృష్టం అనే చెప్పాలి.

ఈ సినిమా ఇంకా సెట్స్ మీదికి వెళ్లకముందే.. దాని గురించి చిన్న కబురు వినిపించినా అభిమానులు చాలా ఎగ్జైట్ అయిపోతున్నారు. స్వయంగా రాజమౌళే ఇటీవల టొరంటో ఫిలిం ఫెస్టివల్‌లో మాట్లాడుతూ.. మహేష్‌తో తాను చేయబోయే సినిమా చాలా పెద్ద రేంజిలో ఉంటుందంటూ ‘గ్లోబ్ ట్రోటింగ్’ అనే పదం వాడిన సంగతి తెలిసిందే.

ఆయన ఆ మాట అన్నాడో లేదో.. అందరూ డిక్షనరీలు తిరగేయడం మొదలుపెట్టారు. అసలేంటి ఈ పదానికి అర్థం అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రపంచం మొత్తం విస్తరించే అనే అర్థం వస్తుంది ఆ పదానికి. తాజాగా .జక్కన్న మరోసారి మహేష్‌తో చేయబోయే సినిమా గురించి మాట్లాడుతూ ఈ పదాన్ని ప్రస్తావించాడు. లాస్ ఏంజిల్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ షోకు హాజరైన సందర్భంగా తర్వాతి సినిమా ప్రస్తావన తెచ్చాడు జక్కన్న. అది తన కెరీర్లో బిగ్గెస్ట్ ఎవర్ ఫిలిం అవుతుందని చెప్పిన ఆయన.. అదొక యాక్షన్ మూవీ అని కూడా వెల్లడించాడు.

అలాగే తాను ఈ సినిమా గురించి ఇంతకుముందు ప్రస్తావిస్తూ ‘గ్లోబ్ ట్రోటింగ్’ అనే పదాన్ని వాడితే.. అది సోషల్ మీడియాలో ట్రెండ్ అయిందని కూడా గుర్తు చేసుకున్నాడు. తన కెరీర్లో బిగ్గెస్ట్ ఎవర్ ఫిలిం అవుతుందని, ఇది యాక్షన్ జోనర్ ఫిలిం అని జక్కన్న చెప్పడం మహేష్ అభిమానుల్లో మరింత ఎగ్జైట్మెంట్ పెంచేదే. ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో పట్టాలెక్కుతుందని అంచనా.