ఆర్ఆర్ఆర్.. ఇదేం మ్యాడ్‌నెస్?


‘బాహుబలి’ తర్వాత రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 25న విడుదల కావడం.. అంచనాలకు తగ్గట్లే భారీ విజయాన్నందుకోవడం తెలిసిందే. ఆ సినిమా థియేట్రికల్ రన్ ముగిశాక.. నెట్ ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్ డిజిటల్ రిలీజ్ తర్వాత ఈ సినిమా గురించి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ‘బాహుబలి’తో పోలిస్తే తక్కువ అనిపించిన మన వాళ్లకు తక్కువగా అనిపించిన ‘ఆర్ఆర్ఆర్’కు అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన స్పందన చూసి అందరూ షాకైపోయారు. ముఖ్యంగా హాలీవుడ్ ప్రేక్షకులు, నేటివ్ అమెరికన్స్ ఈ సినిమా చూసి వెర్రెత్తిపోయారు. నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమాకు వచ్చిన అప్లాజ్ అలాంటిలాంటిది కాదు.

ముందు కొందరు హాలీవుడ్ క్రిటిక్స్, సెలబ్రెటీస్ ‘ఆర్ఆర్ఆర్’ను పొగుడుతూ ట్వీట్లు వేస్తుంటే ఇదేదో పెయిడ్ ప్రమోషన్ అనుకున్నారు. కానీ తర్వాత వాళ్లు నిజంగానే ఈ సినిమా చూసి పిచ్చెక్కిపోతున్నారని వందలు, వేలల్లో ట్వీట్లు చూశాక, వాళ్ల ఎగ్జైట్మెంట్‌ను గమనించాక అర్థమైంది.

ఇక తాజాగా యుఎస్‌లోని లాస్ ఏంజెల్స్‌లో ‘బియాండ్ ఫెస్ట్’ వేడుకల్లో భాగగా టీసీఎల్ చైనీస్ థియేటర్లో ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ షో వేశారు. ఈ భారీ ఐమ్యాక్స్ థియేటర్లలో ప్రదర్శన సందర్భంగా ఆడిటోరియం మొత్తం నిండిపోయింది. ఈ షోకు స్వయంగా దర్శకుడు రాజమౌళి కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా నాటు నాటు పాట టైంకి యుఎస్ ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. మన దగ్గర సింగిల్ స్క్రీన్ల ముందు ఇక్కడి అభిమానులు చేసినట్లు నేటివ్ అమెరికన్స్ నాటు నాటు పాటకు స్టెప్పులేయడం విశేషం. బహుశా అమెరికన్ ఆడియన్స్ ఇలా చేయడం ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరేమో.

ఇది అమీర్ పేట కాదు.. అమెరికా అంటూ ఈ వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. అమెరికన్ ఆడియన్స్‌కు ఈ స్థాయిలో పిచ్చెక్కించడం రాజమౌళికే చెల్లిందని.. ఈ సినిమా వారిని ఏ స్థాయిలో ఆకట్టుకుందో చెప్పడానికి ఇంతకంటే రుజువు అక్కర్లేదని నెటిజన్లు జక్కన్న అండ్ కోను కొనియాడుతున్నారు.