తెలుగు ప్రేక్ష‌కుల‌పై ఏడుపా.. ఇదేం న్యాయం?


ప్ర‌శాంత్ రంగ‌స్వామి అని త‌మిళంలో కాస్త పేరున్న క్రిటిక్ క‌మ్ ట్రేడ్ అన‌లిస్ట్. ట్విట్ట‌ర్లో అత‌డికి ఆరున్న‌ర ల‌క్ష‌ల‌మంది ఫాలోవ‌ర్లున్నారు. యూట్యూబ్‌లో అత‌డి ఛానెల్‌కు ఇంకా ఎక్కువ‌మందే ఫాలోవ‌ర్లున్నారు. అత‌ను శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఒక ట్వీట్ వేశాడు. తెలుగు సినిమాలో త‌మిళంలో ఎంత బాగా ఆడినా, ఎన్ని వ‌సూళ్లు సాధించినా మాకు అభ్యంత‌రం లేదు. కానీ త‌మిళ సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు కించ‌ప‌రిస్తే మాత్రం ఊరుకునేది లేదు. గ‌ట్టిగా బ‌దులిస్తాం.. ఇదీ అత‌డి ట్వీట్.

పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమాను మ‌న‌వాళ్లు డీగ్రేడ్ చేస్తున్నార‌ట‌. ఆ సినిమా గురించి నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నార‌ట‌.. బాహుబ‌లితో పోల్చి దాన్ని త‌క్కువ చేస్తున్నార‌ట‌. ప్ర‌శాంత్ స‌హా త‌మిళ క్రిటిక్స్, అక్క‌డి ప్రేక్ష‌కుల ఆరోప‌ణ ఇది. ఈ విష‌యంలో తెలుగు ప్రేక్ష‌కుల‌ను కించ‌ప‌రిచేలా కొన్ని పోస్టులు కూడా పెట్ట‌డం గ‌మ‌నార్హం.

ఇది చూసి తెలుగు ప్రేక్ష‌కులకు మండిపోయింది. త‌మిళ క్రిటిక్స్‌కు, అక్క‌డి ప్రేక్ష‌కుల‌కు మ‌న వాళ్లు దీటుగానే బ‌దులిస్తున్నారు. అస‌లు భాష‌తో సంబంధం లేకుండా ఎక్క‌డి సినిమా అయినా స‌రే.. బాగుందంటే నెత్తిన పెట్టుకోవ‌డం తెలుగు ప్రేక్ష‌కుల‌కే చెల్లింది. ముఖ్యంగా మ‌న ప్రేక్ష‌కులు ఒక టైంలో తెలుగు సినిమాల‌ను మించి త‌మిళ చిత్రాల‌ను ఆద‌రించారు. మొద‌ట్నుంచి త‌మిళ హీరోల‌ను, ద‌ర్శ‌కుల‌ను మ‌న ప్రేక్ష‌కులు ఎలా నెత్తిన పెట్టుకుంటున్నారో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. చాలామంది హీరోలు, ద‌ర్శ‌కులు మ‌న ద‌గ్గ‌ర స్టార్ ఇమేజ్ సంపాదించారు.

ఇప్పుడు పొన్నియ‌న్ సెల్వ‌న్‌లో కీల‌క పాత్ర పోషించిన కార్తిని ఒక సినిమా వేడుక సంద‌ర్భంగా మీకు త‌మిళ ప్రేక్ష‌కులు ఎక్కువ ఇష్ట‌మా, తెలుగు ప్రేక్ష‌కులు ఎక్కువ ఇష్ట‌మా అంటే మొహ‌మాట‌ప‌డ‌కుండా తెలుగు ప్రేక్ష‌కులే అని చెప్పాడు. యుగానికి ఒక్క‌డు, ఆవారా సినిమాల‌ను తాను తెలుగులో ప్రేక్ష‌కుల మ‌ధ్య చూశాన‌ని, ప్ర‌తి స‌న్నివేశానికీ క్లాప్స్ కొడుతూ వాళ్లు ఆ చిత్రాల‌ను ఆద‌రించిన తీరు అద్భుత‌మ‌ని, అంత అప్లాజ్ త‌న‌కు త‌మిళ ప్రేక్ష‌కుల నుంచి కూడా రాలేద‌ని అన్నాడు. మ‌న వాళ్లు త‌మిళ సినిమాలు బాగుంటే ఎంత‌గా ఆద‌రిస్తారో చెప్ప‌డానికి ఇంత‌కంటే రుజువేం కావాలి? అలాంటి వాళ్ల మీద నింద‌లేయ‌డం కంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా?