ఒకప్పుడు ఇండియా మొత్తానికి సినిమాల విషయంలో ఆదర్శంగా నిలిచేది తమిళ ఫిలిం ఇండస్ట్రీ. అక్కడి సినిమాల నాణ్యత, వైవిధ్యం, భారీతనం, రీచ్ అంతా కూడా వేరే స్థాయిలో ఉండేది. వాళ్ల సినిమాలతో పోల్చుకుని మనం ఇన్ఫీరియర్‌గా ఫీలయ్యేవాళ్లం. తమిళ ఫిలిం మేకర్స్ ఘనతను కొనియాడేవాళ్లం. కానీ గత దశాబ్ద కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
మన సినిమాల క్వాలిటీ పెరిగింది. వాటి రీచ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక వాటి కమర్షియల్ సక్సెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అదే సమయంలో తమిళ సినిమాల క్వాలిటీ బాగా పడిపోయి.. వాటికి తమిళనాడు అవతల ఆదరణ కరవవుతోంది. ‘బాహుబలి’కి పోటీగా అని చెప్పి కొన్ని ప్రయత్నాలేవో చేశారు కానీ.. వాటి వల్ల ఎలాంటి ఫలితం దక్కలేదు. ఇప్పుడు కోలీవుడ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సినిమా ‘పొన్నియన్ సెల్వన్’ మరి కొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఎప్పుడో మూడు దశాబ్దాల ముందు, తన కెరీర్ ఆరంభంలోనే మణిరత్నం ఈ భారీ సినిమా తీయాలనుకున్నాడు. రకరకాల కారణాలతో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు మూడేళ్ల కింద తన కలల ప్రాజెక్టును పట్టాలెక్కించాడు మణిరత్నం. విక్రమ, ఐశ్వర్యారాయ్, కార్తి, త్రిష, జయం రవి, ప్రకాష్ రాజ్.. ఇలా భారీ తారాగణమే ఉందీ సినిమాలో. ఏఆర్ రెహమాన్, రవివర్మన్, తోటతరణి.. ఇలా మహామహులైన టెక్నీషియన్లు పనిచేశారీ చిత్రానికి. బడ్జెట్ వందల కోట్లు అయింది. ఇలా అనేక విషయాల్లో ‘బాహుబలి’తో పోలిక కనిపిస్తున్నప్పటికీ.. ఆ సినిమాలా ఇతర భాషల వాళ్లను ఇది ఆకర్షించలేకపోయింది. బజ్ క్రియేట్ చేయలేకపోయింది.
ఐతే తమిళంలో కల్ట్ స్టేటస్ ఉన్న నవల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఆ నవల గురించి అందరూ గొప్పగా చెబుతుంటారు. కాబట్టి కథలో ఉన్న బలం, మలుపులు సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్తాయని చిత్ర బృందం ధీమాతో ఉంది. ఈ సినిమా మీద కేవలం దాని మేకర్స్ మాత్రమే కాక.. కోలీవుడ్ కూడా చాలా ఆశలతో ఉంది. ఇది తమిళ సినిమా సత్తాను తెలియజేస్తుందని, తమ పరిశ్రమ మళ్లీ జాతీయ స్థాయిలో తలెత్తుకునేలా చేస్తుందని ఆశిస్తున్నారు ఆ ఇండస్ట్రీ జనాలు. మరి వారి ఆశలు, అంచనాలను ‘పొన్నియన్ సెల్వన్’ ఏమేర నిలబెడుతుందో చూడాలి.