దసరా ఫోకస్ అంతా అతడి మీదే..


మొత్తానికి దసరా లైనప్ ఖరారైపోయింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘గాడ్ ఫాదర్’తో పాటు అక్కినేని నాగార్జున మూవీ ‘ది ఘోస్ట్’.. బెల్లంకొండ గణేష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ‘స్వాతిముత్యం’ దసరా బరిలో నిలిచాయి. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం అయితే ఈ మూడు సినిమాలూ దసరా రోజైన అక్టోబరు 5నే విడుదల కాబోతున్నాయి.

ఐతే ఈ మూడు చిత్రాల్లో ప్రత్యేకంగా కనిపిస్తున్నది, కథాకథనాల పరంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్నది ‘ది ఘోస్ట్’ మూవీనే. మూడు దసరా చిత్రాల దర్శకుల్లో ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నది కూడా ఈ సినిమాను రూపొందించిన ప్రవీణ్ సత్తారునే. మోహన్ రాజాకు తమిళంలో మంచి పేరే ఉన్నప్పటికీ.. అతను ఎక్కువగా తీసింది రీమేక్ మూవీసే. ‘గాడ్ ఫాదర్’ సైతం రీమేక్ మూవీనే కావడంతో మోహన్ రాజా గురించి పెద్దగా డిస్కషన్ లేదు. ఇక ‘స్వాతిముత్యం’ సంగతి చూస్తే అది సగటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగే కనిపిస్తోంది. దాని దర్శకుడు లక్ష్మణ్‌ది ఒక సినిమా అనుభవమే.

‘ది ఘోస్ట్’ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ట్రాక్ రికార్డు గురించి తెలిసిందే. ‘ఎల్బీడబ్ల్యూ’ మొదలుకుని.. ‘గరుడ వేగ’ వరకు అతను ఒక సినిమాకు ఇంకో సినిమాకు సంబంధం లేనట్లు వైవిధ్యమైన సినిమాలు తీశాడు. తన ప్రతి సినిమాతోనూ ప్రేక్షకులను ఎగ్జైట్ చేశాడు. రాజశేఖర్ లాంటి ఫాంలో లేని, జనాలు పూర్తిగా మరిచిపోయిన సీనియర్ హీరోతో అతను ‘గరుడ వేగ’ లాంటి స్టన్నింగ్ థ్రిల్లర్ తీసి ఎంతగా అలరించాడో తెలిసిందే. దీని తర్వాత ప్రవీణ్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు.

ఐతే అతను గోపీచంద్ బయోపిక్ కోసం కొంత కాలం స్ట్రక్ అయిపోయాడు. దాని సంగతి ఎటూ తేలకపోవవడంతో చివరికి నాగ్‌తో ‘ది ఘోస్ట్’ పట్టాలెక్కించాడు. ఈ సినిమా ఆరంభం నుంచి ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రోమోలు భలే ఎగ్జైటింగ్‌గా అనిపించాయి. ఈ సినిమా కథాకథనాలు ఎలా ఉంటాయి.. నాగ్ పాత్ర ఎలా ఉంటుంది.. ప్రవీణ్ మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాడా అన్నది ఆసక్తికరం. మరి ప్రవీణ్ ఈసారి ఏమేర అంచనాలు అందుకుంటాడో చూడాలి.