తమ్ముడు ఏమయ్యాడంటే

గాడ్ ఫాదర్ కౌంట్ డౌన్ ఎనిమిది రోజుల్లోకి వచ్చేసింది. పెద్దగా బజ్ లేదని టెన్షన్ పడుతున్న అభిమానులకు ఊరట కలిగించేలా కొత్తగా వదులుతున్న పోస్టర్లు బాగానే వైరలవుతున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన కొత్త పాట ఆడియో పరంగా ఏమో కానీ స్టైలిష్ యాక్షన్ లుక్స్ లో మెగాస్టార్ ని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. రియల్ స్వాగ్ ని ఇప్పుడు బయట పెడుతున్నారని సోషల్ మీడియాలో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి చాలా విశేషాలు ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా అందరి చూపు ట్రైలర్ మీదే ఉంది.

ఇక అసలు విషయానికి వస్తే లూసిఫర్ రీమేక్ గా రూపొందుతున్న ఈ పొలిటికల్ డ్రామాలో అన్ని పాత్రలకు సంబంధించిన క్లారిటీ దాదాపుగా వచ్చేసింది. చెడ్డవాడైన పోలీస్ గా సముతిరఖాని, విలన్ గా సత్యదేవ్, అతని భార్యగా నయనతార, చనిపోయే సిఎంగా సర్వదమన్ బెనర్జీ, విశ్వసనీయుడైన కార్ డ్రైవర్ గా సునీల్, రాజకీయ చాణుక్యుడిగా మురళి శర్మ ఇలా అందరి క్యారెక్టర్స్ తాలూకు అన్ని డీటెయిల్స్ రివీల్ అయినట్టే. అయితే ఒరిజినల్ వెర్షన్ సెకండ్ హాఫ్ లో చాలా కీలకంగా కనిపించే హీరో తమ్ముడి పాత్ర తాలూకు లీక్స్ మాత్రం రాలేదు.

మలయాళంలో దాన్ని టొవినో థామస్ పోషించాడు. కానీ ఇక్కడ ఎవరనేది బయటికి తెలియనివ్వలేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం తెలుగులో ఆ పాత్రను పూర్తిగా తీసేశారట. చాలా ప్రాధాన్యం ఉండే ఆ బ్రదర్ కు బదులు కొన్ని కీలక మార్పులు చేసి మోహన్ లాల్ మూవీలో లేనివి ఇందులో జోడించారని తెలిసింది. స్టార్ట్ అయినప్పుడు దీన్ని వరుణ్ తేజ్ లేదా సాయితేజ్ తో చేయిస్తారనే ప్రచారం జరిగింది కానీ ఇప్పడదేమీ లేనట్టే. దర్శకుడు మోహన్ రాజా ఫ్రెష్ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పడానికి కారణం ఇదేనేమో. మక్కికి మక్కి వద్దనుకుని తీసుకున్న ఈ నిర్ణయం ఎలా ఉండబోతోందో చూడాలి మరి.