చెన్న‌కేశ‌వ‌రెడ్డి రీరిలీజ్.. ఇది ఇంకో లెవెల్

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు స్టార్ హీరోల పాత సినిమాల‌ను భారీ స్థాయిలో రీ రిలీజ్ చేయ‌డం.. వాటి షోలు, క‌లెక్ష‌న్ల‌తో కొత్త రికార్డులు నెల‌కొల్ప‌డం ట్రెండుగా మారింది. గ‌త నెల‌లో పోకిరి మూవీతో, ఈ నెల ఆరంభంలో జ‌ల్సా మూవీతో మ‌హేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన హంగామాను అంద‌రూ చూశారు. ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ అభిమానుల వంతు వ‌చ్చింది.

ఈ నెల 24న చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమా 20వ వార్షికోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని.. ఈ చిత్రాన్ని ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అటు యుఎస్‌లో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. యుఎస్‌లో రికార్డు స్థాయిలో 25 దాకా షోలు ప‌డుతున్నాయి. వాటికి అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జ‌రుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చెన్న‌కేశ‌వ‌రెడ్డి రీరిలీజ్ ప‌నులు కొంచెం ఆల‌స్యంగా మొద‌లైన‌ప్ప‌టికీ.. త్వ‌ర‌గానే వేగం పుంజుకున్నాయి.

స్వ‌యంగా చెన్న‌కేశ‌వ‌రెడ్డి ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్, నిర్మాత బెల్లంకొండ సురేష్‌.. ఈ సినిమా రీరిలీజ్ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో ఒక ప్రెస్ మీట్ నిర్వ‌హించ‌డం విశేషం. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 300 నుంచి 350 థియేట‌ర్ల‌లో రిలీజ్ కానున్న‌ట్లు సురేష్ వెల్ల‌డించారు. అభిమానుల ఉత్సాహం చూస్తే చాలా ఆనందంగా ఉంద‌ని, ఈ సినిమా ద్వారా వ‌చ్చే ఆదాయంలో మెజారిటీ బాలయ్య ఛైర్మ‌న్‌గా ఉన్న బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆసుప‌త్రికి విరాళంగా అంద‌జేయ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

సురేష్ చెబుతున్న 300-350 థియేట‌ర్ల‌ లెక్క‌ల్ని బ‌ట్టి చూస్తే చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమా రీరిలీజ్ షోలు, వ‌సూళ్ల విషయంలో కొత్త రికార్డులు నెల‌కొల్పేలాగే క‌నిపిస్తోంది. నిజానికి చెన్న‌కేశ‌వ‌రెడ్డి ఫ్లాప్ మూవీనే. కానీ అందులో ఫ్యాన్ మూమెంట్స్, మాస్ ఎలివేష‌న్ల‌కు కొద‌వ ఉండ‌దు. ఇలాంటి సినిమాతో ఇప్పుడు ఇంత హంగామా చేస్తుండడం బాల‌య్య అభిమానుల‌కే చెల్లింది.