ఆస్కార్ కు ఇండియన్ అఫీషియల్ నామినేషన్ గా వెళ్తుందని ఆశలు పెట్టుకున్న ఆర్ఆర్ఆర్ కు పరాభవం తప్పలేదు. గుజరాతి ఆఫ్ బీట్ మూవీ చేల్లో షో (లాస్ట్ ఫిలిం షో)ని మన దేశం తరఫున బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం విభాగం కోసం పంపించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ టాపిక్ అట్టుడుకిపోతోంది. కమర్షియల్ మీటర్ లో ఆడిన సినిమాలను కనీస పరిగణనలోకి తీసుకోకుండా కేవలం విమర్శకులను మెప్పించినవాటిని మాత్రమే గొప్ప కళాఖండాలుగా భావించే కమిటీ సభ్యులు ఇలా చేయడం ఇది మొదటిసారి కాదు చివరిసారి కాబోదు.
నిజానికి బాలీవుడ్ ప్రముఖులతో మొదలుకుని ఎందరో ఇండస్ట్రీ పెద్దలు ఆర్ఆర్ఆర్ కు అన్ని అర్హతలు ఉన్నాయనే భావించారు. టెక్నికల్ బ్రిలియన్స్ తో పాటు ఎమోషన్స్ ని రంగరించిన తీరు విదేశాల్లో ప్రీమియర్లు వేసిన ప్రతిసారి అక్కడి ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టించుకుంది. అది కూడా తెలుగు భాషలో సబ్ టైటిల్స్ సహాయంతో చూసినందుకే వాళ్ళు అంత ఎగ్జైట్ అయ్యారంటే కంటెంట్ ఏ స్థాయిలో మెప్పించిందో వేరే చెప్పాలా. అయినా కూడా ఆస్కార్ రేస్ లో నిలబెట్టేందుకు మొండిచేయి చూపించడం మూవీ లవర్స్ కు బాధ కలిగిస్తోంది.
నిజానికి రాజమౌళి మొన్నో ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వచ్చినా రాకపోయినా ఊడేదేమీ లేదు. గతంలో లగాన్, శంకరాభరణం, స్వాతిముత్యం, ద్రోహి, దంగల్, బాహుబలి లాంటి ఎన్నో క్లాసిక్స్ కే ఈ అవమానం తప్పలేదు. అలాంటప్పుడు జక్కన్న పనితనాన్ని గుర్తించలేదని ఫీలవ్వడం కన్నా ఇకపై ఆస్కార్ గురించి అక్కడి సెలెక్టర్స్ ఆలోచనా విధానం గురించి మనం ఎక్కువ ఆలోచించకపోవడం బెటర్, జపాన్, చైనా లాంటి దేశాల్లో బ్రహ్మరధం అందుకుంటున్న టాలీవుడ్ టాలెంట్ కి వేల కోట్లు కురిపిస్తున్న ప్రేక్షకుల ఆశీర్వాదం కన్నా గొప్ప అవార్డు ఏముంటుంది.