ఫేమస్ సినిమాటోగ్రాఫర్ ఛోటా కే నాయుడు మేనల్లుడు అనే గుర్తింపుతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సందీప్ కిషన్.. నటుడిగా కెరీర్ ఆరంభంలో మంచి పేరే సంపాదించాడు. ముఖ్యంగా ప్రస్థానంలో అతను చేసిన నెగెటివ్ రోల్ చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత హీరోగా మారి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ లాంటి సూపర్ హిట్‌తో తనపై అంచనాలు పెంచాడు సందీప్. కానీ ఆ అంచనాలను తర్వాత అతను అందుకోలేకపోయాడు. సరైన సినిమాలు చేయకపోవడంతో కెరీర్ బాగా డౌన్ అయిపోయింది. టైగర్, నిను వీడని నీడను నేనే లాంటి సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి తప్ప.. నిఖార్సయిన హిట్ లేక బాగా ఇబ్బంది పడుతున్నాడు.
ఈ మధ్య అతడి నుంచి మరీ సాధారణమైన సినిమాలు వస్తున్నాయి. టాలెంట్ ఉండి, అవకాశాలకు లోటు లేకపోయినా.. పనికిరాని సినిమాలు చేసి వేస్ట్ చేసుకుంటున్నాడనే విమర్శలు సందీప్ మీద ఉన్నాయి. ఐతే తెలుగులో క్వాలిటీ సినిమాలు ఎంచుకోవడంలో తడబడుతున్న సందీప్‌కు తమిళంలో మాత్రం ముందు నుంచి మంచి మంచి సినిమాలు పడుతుండడం విశేషం.
ఇప్పుడు తమిళంలో నంబర్ వన్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్ తొలి చిత్రం మానగరంలో సందీపే హీరో. ఆ తర్వాత మాయవన్ అనే అదిరిపోయే థ్రిల్లర్ సినిమాలో లీడ్ రోల్ చేశాడు సందీప్. అది కాక ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న కసాటడబార అనే మరో వెబ్ మూవీలోనూ సందీప్ అదరగొట్టాడు. ప్రస్తుతం మైకేల్ అనే క్రేజీ చిత్రంలో నటిస్తున్నాడు. దానిపై మంచి అంచనాలుండగా.. ఇప్పుడు సందీప్ మరో భారీ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకున్నాడు.
ధనుష్ హీరోగా సానికాయిదం (చిన్ని) దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ రూపొందించనున్న కెప్టెన్ మిల్లర్‌లో కీలక పాత్రకు సందీప్ ఎంపిక కావడం విశేషం. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఇలాంటి పాన్ ఇండియా మూవీలో సందీప్‌కు ముఖ్య పాత్ర దక్కడం విశేషం. ఓవైపు తెలుగులో సాధారణ సినిమాలు చేస్తూ.. తమిళంలో మాత్రం సందీప్ మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటూ ఉండడం, అతడి టాలెంట్‌ను తమిళ దర్శకుల మాదిరి మన వాళ్లు ఉపయోగించుకోలేకపోతుండడం ఆశ్చర్యం కలిగించే విషయం.