శింబు సినిమాకు ఈ క‌ష్టాలేంటో?

మ‌న్మ‌థ సినిమాతో అప్ప‌ట్లో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు త‌మిళ క‌థానాయ‌కుడు శింబు. ఆ సినిమా వ‌సూళ్లు చూసి టాలీవుడ్ ఉలిక్కి ప‌డింది. ఓ ఇంట‌ర్వ్యూలో శింబు చెప్పిన ప్ర‌కారం ఈ చిత్ర తెలుగు డ‌బ్బింగ్ హ‌క్కుల రూ.30 ల‌క్ష‌ల‌కు ఇస్తే.. వ‌సూళ్లు రూ.9 కోట్ల‌కు పైగా వ‌చ్చాయ‌ట‌. దీన్ని బ‌ట్టి అదెంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవ‌చ్చు.

ఈ సినిమా అంత పెద్ద హిట్ కావ‌డంతో త‌ర్వాత వ‌ల్ల‌భ‌కు భారీ క్రేజ్ వ‌చ్చింది. కానీ ఆ సినిమా అంచ‌నాలను అందుకోలేక‌పోయింది. త‌ర్వాత వ‌చ్చిన శింబు సినిమాలేవీ తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేదు. ఐతే చాన్నాళ్ల త‌ర్వాత శింబు కొంచెం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టి త‌న కొత్త చిత్రం వెందు త‌నింద‌ద కాదును తెలుగులో కొంచెం ప్లాన్ చేసి రిలీజ్ చేయించాల‌ని చూశాడు.

లైఫ్ ఆఫ్ ముత్తు పేరుతో ఈ సినిమాను డ‌బ్ చేశారు. కాస్త ప్ర‌మోష‌న్లు కూడా బాగానే చేశారు. కానీ త‌మిళంతో పాటుగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయించ‌డం మాత్రం కుద‌ర‌లేదు. గురువార‌మే విడుద‌ల కావాల్సిన సినిమా.. రెండు రోజులు వాయిదా ప‌డింది. మ‌రి శ‌నివారం అయినా స‌వ్యంగా సినిమా రిలీజైందా అంటే అదీ లేదు. త‌మిళంలో సినిమాకు మంచి టాక్ రావ‌డంతో టికెట్లు కొని శ‌నివారం మార్నింగ్ షోల‌కు వెళ్లిన వాళ్ల‌కు నిరాశ త‌ప్ప‌లేదు.

ఏవో ఇష్యూల కార‌ణంగా మార్నింగ్ షోలు ప‌డ‌లేదు. మ్యాట్నీల‌కు బుకింగ్స్ బుకింగ్స్ ఆపేశారు. జ‌నాలు కూడా ఇక థియేట‌ర్ల వైపు చూడ‌లేదు. మ‌ధ్యాహ్నం త‌ర్వాత క్లియరెన్స్ వ‌చ్చి షోలు మొద‌లైనా స‌రైన రెస్పాన్స్ లేదు. సాయంత్రానికి ప‌రిస్థితి మెరుగుప‌డుతుందేమో చూడాలి. ఈ వారం వ‌చ్చిన తెలుగు సినిమాల‌న్నీ డివైడ్, నెగెటివ్ టాక్ తెచ్చుకున్న నేప‌థ్యంలో లైఫ్ ఆఫ్ ముత్తు రిలీజ్ స‌రిగ్గా జ‌రిగి ఉంటే అడ్వాంటేజ్ అయ్యేది. కానీ ప్లానింగ్ లోపం వ‌ల్ల జ‌నాల్లోఇ సినిమా వెళ్ల‌డం క‌ష్టంగానే ఉంది.