స‌మ్మోహ‌నం మ్యాజిక్ రిపీట‌వుతుందా?

స‌మ్మోహ‌నం.. తెలుగులో గ‌త కొన్నేళ్ల‌లో వ‌చ్చిన ఉత్త‌మ ప్రేమ‌క‌థా చిత్రాల్లో ఒక‌టి. ఆ సినిమా మొద‌లైన‌పుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ లాంటి అభిరుచి ఉన్న ద‌ర్శ‌కుడు న‌టుడిగా త‌డ‌బ‌డుతున్న సుధీర్ బాబుతో సినిమా తీయ‌డ‌మేంటి అని సందేహించారు. కానీ సుధీర్ బాబులో ఎంత మంచి న‌టుడున్నాడో ఈ సినిమాతో రుజువు చేశాడు ఇంద్ర‌గంటి. అత‌డి నుంచి బెస్ట్ పెర్ఫామెన్స్ రాబ‌ట్టుకోవ‌డ‌మే కాక‌.. అదితి రావు హైద‌రిని అద్భుతంగా చూపించి… హృద్య‌మైన ప్రేమ‌క‌థ‌ను అందంగా ఆవిష్క‌రించి ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచాడు.

థియేట‌ర్ల‌లో ఓ మోస్త‌రుగా ఆడిన ఆ చిత్రం.. ఆ త‌ర్వాత టీవీలో, ఓటీటీలో క‌ల్ట్ స్టేట‌స్ తెచ్చుకుంది. ఈ క‌ల‌యిక‌లో ఇంకో సినిమా అన‌గానే అంద‌రిలోనూ ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది. వీరి కాంబినేష‌న్లో తెర‌కెక్కిన కొత్త చిత్రం.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.

టైటిల్ ద‌గ్గ‌రే స‌గం మార్కులు కొట్టేసిన ఇంద్ర‌గంటి.. ప్రోమోలతోనూ ఆక‌ట్టుకున్నాడు. కాక‌పోతే ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తే స‌మ్మోహ‌నంతో చాలా పోలిక‌లు క‌నిపించాయి. అది సినిమాకు ప్ల‌స్సే కాక మైన‌స్ కూడా. సినిమాకు బ‌జ్ క్రియేట్ కావ‌డం ఈజీనే కానీ.. పోలిక‌లు చేటు చేస్తాయి. సినిమా అదే త‌ర‌హాలో ఉంటే కొత్తద‌నాన్ని ఫీల‌వ్వ‌రు. ప్ర‌తిదీ పాత సినిమాతో పోల్చుకుని చూస్తారు. మ‌రి ఈసారి ప్రేక్ష‌కుల‌కు ఇంద్ర‌గంటి ఎలాంటి అనుభూతిని ఇస్తాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రం.

సుధీర్ సంగ‌తి ఏమో కానీ.. అదితిరావు హైద‌రి త‌ర‌హాలో మెప్పించ‌డం కృతికి స‌వాలే. మ‌రి ఆమె స‌వాలును ఎలా స్వీక‌రిస్తుందో చూడాలి. ఈ శుక్ర‌వారం దీంతో పాటుగా నేను మీకు బాగా కావాల్సిన వాడిని, శాకిని డాకిని చిత్రాలు కూడా రిలీజ‌వుతున్నాయి. వాటి మీద మ‌రీ అంచ‌నాలేమీ లేవు. శ‌నివారం డ‌బ్బింగ్ మూవీ ది లైఫ్ ఆఫ్ ముత్తు కూడా విడుద‌ల‌వుతోంది. త‌మిళంలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్ష‌కులను ఏమేర ఆక‌ర్షిస్తుందో చూడాలి.