సినిమా రివ్యూల‌పై నాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Movie Reviews: సినిమా రివ్యూల ప‌ట్ల ఇండ‌స్ట్రీ జ‌నాల నుంచి మిశ్ర‌మ అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతుంటాయి. కొంద‌రు రివ్యూలు అవ‌స‌రం అంటారు. వాటి ప‌ట్ల సానుకూలంగా మాట్లాడతారు.

కొంద‌రేమో రివ్యూలు సినిమాల‌కు చేటు చేస్తున్నాయ‌ని.. సినిమాలు బాలేన‌పుడు వేగంగా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయి వ‌సూళ్లు ప‌డిపోవ‌డానికి రివ్యూలు కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేస్తుంటారు. కానీ మంచి సినిమాల‌కు రివ్యూలు చాలా లాభం చేకూరుస్తాయ‌న్న‌ది కూడా వాస్త‌వ‌మే.

సినిమా బాగుంటే రివ్యూల వ‌ల్ల ప్రయోజ‌న‌మే త‌ప్ప న‌ష్ట‌మైతే లేదు. ఈ ఇంటర్నెట్ రివ్యూల‌ను నివారించ‌డం సాధ్యం కాని ప‌ని. వాటి ప‌ట్ల వ్య‌తిరేక‌త చూపించ‌డంలో కూడా అర్థం లేదు. సినిమా వాళ్ల‌యినా స‌రే.. వేరే సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడాలంటే రివ్యూల మీద ఆధార‌ప‌డ‌తార‌న‌డంలో సందేహం లేదు.

ఈ విష‌యాన్ని అంద‌రూ ఒప్పుకోక‌పోవ‌చ్చు కానీ.. సీనియ‌ర్ హీరో అక్కినేని నాగార్జున మాత్రం ఓపెన్ అయ్యారు. తాను కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడాల‌నుకున్న‌పుడు రివ్యూల మీద ఆధార‌ప‌డ‌తాన‌ని నాగ్ (Nagarjuna) తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు.

రివ్యూల ప‌రిణామ క్ర‌మం గురించి ఆయ‌న మాట్లాడుతూ.. ఒక‌ప్పుడు సినిమా స‌మీక్ష‌లు వారం త‌ర్వాత ప‌త్రిక‌లు, మ్యాగ‌జైన్ల‌లో వ‌చ్చేవి. అప్ప‌టికి సినిమా ఉందో లేదో కూడా చాలామందికి తెలిసేది కాదు. అప్పుడు ఆ రివ్యూల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకునేవారు కూడా కాదు.

కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి. సోష‌ల్ మీడియా, అలాగే వెబ్ సైట్లు పెరిగాక రివ్యూల‌కు డిమాండ్ పెరిగింది. సినిమా టాక్‌లో రివ్యూలు ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాయి. నేను కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడాలంటే ముందు ఐఎండీబీ రేటింగ్స్ చూస్తా. క‌నీసం వెయ్యి రివ్యూలు, 7కు పైగా రేటింగ్ ఉంటేనే ఆ సినిమా లేదా సిరీస్ చూస్తా. లేదంటే టైం వేస్ట్ క‌దా అని నాగ్ వివ‌రించాడు.