గత నెల బింబిసారతో గట్టి పోటీ మధ్య విడుదలై భారీ అంచనాలు లేకపోయినా బ్లాక్ బస్టర్ సక్సెస్ తో అద్భుత విజయాన్ని అందుకున్న సీతారామం ముప్పై అయిదు రోజులు పూర్తి చేసుకోవడం ఆలస్యం అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా పెద్ద హిట్టు లేక కొంత డల్ గా ఉన్న ఈ ఓటిటికి ఫుల్ జోష్ వచ్చేసింది. స్ట్రీమింగ్ మొదలైన సెప్టెంబర్ 9 అర్ధరాత్రి నుంచి కోట్లలో వ్యూస్ హోరెత్తిపోతున్నాయని డిజిటల్ మీడియా రిపోర్ట్. థియేటర్లో చూసిన వాళ్ళు మళ్ళీ రిపీట్ రన్స్ వేసుకుంటుండగా హాలు దాకా వెళ్లని వాళ్ళు అంతగా ఇందులో ఏముందని షోలు మొదలుపెట్టారు.
విచిత్రంగా సోషల్ మీడియాలో ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం ఏదేదో ఊహించుకున్నామని అంత లేదని రంధ్రాన్వేషణ చేస్తుండగా మరికొందరు మల్లేశ్వరిలో వెంకటేష్ కత్రినాల ఎపిసోడ్ ని సీతా రామ్ లకు ఆపాదించి ఇది అదే కదా అంటూ పోలికల వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. వీటి గురించి డిబేట్లు కూడా జరుగుతున్నాయి. కొన్ని కంటెంట్లు బిగ్ స్క్రీన్ మీద డాల్బీ సౌండ్ తో చూస్తేనే ఆ ఎక్స్ పీరియన్స్ లో కిక్ ఉంటుంది. అంతే తప్ప సోఫాలో బార్లా పడుకుని ఫార్వార్డ్ చేసుకుంటూ చూస్తే అందులో పావు వంతు కూడా ఆస్వాదించలేం.
సీతారామంకు ఇప్పుడదే జరుగుతోంది. ఈ కథలోని ఆత్మ అర్థం కావాలంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేని చీకటి వాతావరణం కావాలి. అంతే తప్ప ఇంట్లో గోల మధ్య అది జరగదు. ఆ మధ్య జాతిరత్నాలు, ఎఫ్3, ప్రతి రోజు పండగే, ఇస్మార్ట్ శంకర్ లకు ఇదే తరహాలో డిజిటల్ లోకి వచ్చాక మిశ్రమ స్పందన వినిపించింది. అందుకే వెండితెర అనుభూతి ఎలాంటి స్మార్ట్ స్క్రీన్లు ఇవ్వలేవని, ఏ సినిమాకైనా సిసలైన నిర్వచనం థియేటరే అనే మాటలో వాస్తవం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. హిందీ వెర్షన్ రిలీజైన కేవలం వారానికే తెలుగు తమిళ మలయాళంని స్ట్రీమింగ్ చేసేయడం ప్రైమ్ కు చాలా ప్లస్ అవుతోంది.