ఎన్నడూ లేనిది మంచి స్నేహితులైన చిరంజీవి, నాగార్జున ఒకే రోజు గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లతో క్లాష్ కు సిద్ధపడటం అభిమానులకు టెన్షన్ కలిగిస్తోంది. మార్కెట్ విషయంలో ఇద్దరినీ ఒకే గాటన కట్టలేకపోయినా గత సినిమాల ట్రాక్ రికార్డు దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు హైప్ మాత్రం ఇంచుమించు సమానంగా నడుస్తోంది. దసరా పండగను టార్గెట్ చేసుకుని ఈ రెండు బరిలో దిగేందుకు రంగం రెడీ అవుతోంది. అక్టోబర్ 5 ఈ మెగా అక్కినేని యుద్ధం ఖాయమని ఇటు బయ్యర్లు అటు ఆడియన్స్ సిద్ధపడుతున్న తరుణంలో ఒక సర్ప్రైజ్ న్యూస్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.
దాని ప్రకారం ది ఘోస్ట్ కొంత వెనుకడుగు తీసుకుని అయిదుకు బదులు ఏడో తేదీన రిలీజ్ చేసేందుకు చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. అధికారికంగా చెప్పలేదు కానీ అంతర్గతంగా డిస్కషన్లు ఆన్ లో ఉన్నాయి. పక్కా డేట్ ని ముందు ప్రకటించింది నాగార్జున బృందమే. తర్వాత గాడ్ ఫాదర్ లాక్ చేసుకుంది. అలాంటప్పుడు రాజీ పడాల్సింది చిరునే కదానే ప్రశ్న ఉత్పన్నం కావడం సహజం. మరి కారణాలేమిటో తెలియదు కానీ కింగ్ టీమ్ ఎందుకు పునరాలోచనలో పడిందో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఫేస్ టు ఫేస్ అనివార్యమైతే ఓపెనింగ్స్ మీద ప్రభావం ఉంటుంది.
దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఇంకో రెండు మూడు రోజుల్లో రానుంది. ప్రమోషన్ల విషయంలో ఇప్పటిదాకా నెమ్మదిగా ఉన్న గాడ్ ఫాదర్ టీమ్ రేపు ఆడియో సింగల్ తాలూకు అప్ డేట్ ఇవ్వనుంది. చిరంజీవి సల్మాన్ ఖాన్ కాంబినేషన్ సాంగ్ ఎప్పుడు వదిలేది చెప్పబోతున్నారు. మరోవైపు ది ఘోస్ట్ ట్రైలర్ ఆల్రెడీ వచ్చేసి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చేసుకుంది. మరి పైన చెప్పినట్టు నాగ్ రాజీ పడతారా లేక ఓసారి సరదగా తలపడి రెండు హిట్లు కొట్టి చూపిద్దామని సవాలుకు సై అంటారా తెలియాల్సి ఉంది. పైకి చెప్పలేదు కానీ ఈ విషయం గురించి ఈ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఓ మాట అనుకునే ఉంటారు.