సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర

ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర జరిగిందట. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాల హత్య కేసు విచారణలో సల్మాన్ హత్యకు జరిగిన కుట్ర బయటపడింది. మూసేవాల టార్గెట్ లో సల్మాన్ కూడా ఉన్నట్లు ప్రస్తుతం విచారణలో నిందితుడుగా ఉన్న కపిల్ పండిట్ బయటపెట్టినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ప్రకటించారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్టులో చాలామంది ఉన్నారని అలాంటి వారిలో సల్మాన్ కీలక టార్గెట్ అని పండిట్ చెప్పారట.

ఎక్కడో కెనడాలో కూర్చునే బిష్ణోయ్ పంజాబ్, ముంబాయ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలో హిట్ లిస్టుని తయారు చేస్తుంటారు. ఈ హిట్ లిస్టు తయారు చేసుకోవటానికి గ్యాంగ్ స్టర్ ప్రాతిపదిక ఏమిటో ఎవరికీ తెలీటంలేదు. ఎలాంటి కారణాలతో బిష్ణోయ్ హిట్ లిస్టును తయారు చేస్తున్నారనే విషయం పోలీసులకు కూడా అర్ధం కావటంలేదు. గ్యాంగ్ స్టర్ నుండి వచ్చే ఆదేశాలను అమలు చేయటమే తమ పనిగా పండిట్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

సింగర్ సిద్ధూ మూసేవాల కూడా పంజాబ్ వ్యక్తే కాబట్టి ఎక్కడో సింగర్ కు గ్యాంగ్ స్టర్ కు గొడవలు జరిగి ఉంటాయని అనుకోవచ్చు. మరి ఏ సంబంధంలేని సల్మాన్ ఖాన్ ను గ్యాంగ్ స్టర్ ఎందుకు చంపాలని అనుకున్నారో ఎవరికీ అంతుబట్టడంలేదు. సల్మాన్ హత్యను సంపత్ నెహ్రా కెనడాకే చెందిన మరో గ్యాంగ్ ద్వారా అమలు చేయాలని బిష్ణోయ్ డిసైడ్ చేసినట్లు పండిట్ చెప్పారు.

హత్యకు గ్యాంగ్ లోని సభ్యులు సల్మాన్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించటమే కాకుండా నటుడిని ఫోన్లో కూడా బెదిరించినట్లు బయటపడింది. మూసేవాల హత్యలో పట్టుబడిన సంతోష్ జాదవ్, అజీర్ బైజాన్ కూడా పాత్రదారులే అని పండిట్ చెప్పినట్లు డీజీపీ చెప్పారు. మూసేవాల హత్య నిందితులు పట్టుబడక పోయుంటే ఈపాటికి ఇంకెంతమంది గ్యాంగ్ చేతిలో హతమయ్యేవారో. గతంలో కూడా కొందరు బాలీవుడ్ ప్రముఖులను మాఫియా గ్యాంగులు హత్య చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.