శింబు సినిమా పరుగులు పెట్టాలి

మాములుగా ఒక సినిమా విడుదలవుతోందంటే దాన్ని జనం మెదడులో రిజిస్టర్ చేయడానికి కనీసం నెల రోజుల ప్రమోషన్ అవసరం. లేదంటే ఎప్పుడో వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో అర్థం కాని వ్యవహారంలా మారిపోతుంది. తర్వాత ఓటిటిలో వచ్చాక అవునా ఇదెప్పుడు రిలీజయ్యిందని ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు శింబు కొత్త మూవీ పరిస్థితి అలాగే ఉంది. ఈ నెల 15న వెందు తనిన్దాతు కాడు (అర్థం ‘కాలిపోయిన అడవి’) రిలీజ్ కు రెడీ అయ్యింది. కల్ట్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం కావడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

ఏ సూచనలు లేకపోవడంతో తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఉండదనే అనుకున్నారు కానీ హఠాత్తుగా స్రవంతి రవికిశోర్ రంగంలోకి దిగి హక్కులు సొంతం చేసుకోవడంతో ఇక్కడా థియేటర్లలోకి రానుంది. వలిమై, తలైవి, ఈటి లాగా తమిళ టైటిలే పెట్టడానికి కుదరదు కాబట్టి ఏదో కొత్త పేరు అర్జెంట్ గా ఫిక్స్ చేయాలి. చేతిలో కేవలం వారం టైం ఉంది. ఈ లోగా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి పబ్లిసిటీ మీద దృష్టి పెట్టాలి. ఏఆర్ రెహమాన్ సంగీతం కనక ఆ అంశాన్ని ప్రేక్షకుల్లో బలంగా రిజిస్టర్ చేయాలి. ముఖ్యంగా ట్రైలర్ కట్ అదిరిపోవాలి.

ఇందులో శింబు టీనేజ్ నుంచి ముసలితనం దాకా మొత్తం అయిదు గెటప్స్ లో కనిపించనున్నాడు. వలస జీవుల బ్యాక్ డ్రాప్ లో ఇది రూపొందింది. నిజానికి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో చాలా ఆలస్యం జరిగింది. ఏడాదికి పైగా షూటింగ్ చేస్తూ వచ్చారు. ఫైనల్ గా ఇప్పటికి మోక్షం దక్కింది. 2004లో మన్మథతో శింబు మన ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. కానీ ఆ తర్వాత చేసినవేవీ ఇక్కడ కనీస స్థాయిలో ఆడకపోవడంతో మార్కెట్ క్రమంగా తగ్గుతూ వెళ్లి ఆఖరికి జీరోకు చేరుకుంది. మానాడుని డబ్ చేయాలని తీవ్రంగా ట్రై చేశాడు కానీ దాని రీమేక్ హక్కులు ఫాన్సీ రేట్ కు అమ్ముడుపోవడంతో అది కుదరలేదు. మరీ ఈ సినిమా అయినా ఎలాంటి బ్రేక్ ఇస్తుందో..