లైగర్ – ఓ అంతులేని కథ

మొదటి వారానికే నెగటివ్ షేర్స్ లోకి వెళ్ళిపోయి విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన లైగర్ అంతకు ముందు ఈ ట్యాగ్ అందుకున్న వరల్డ్ ఫేమస్ లవర్ ని ఈజీగా దాటేసి అంతులేని ప్రవాహంగా ఏదో ఒక రూపంలో సాగుతూనే ఉంది.

తాజాగా టిఆర్ఎస్ మంత్రి ఒకరు ఇందులో బ్లాక్ మనీ పెట్టుబడిగా పెట్టారంటూ కాంగ్రెస్ నాయకుడొకరు చేసిన ఫిర్యాదు ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. విజయ్ తన రెమ్యునరేషన్ నుంచి ఆరు కోట్లు వెనక్కు ఇచ్చాడని సోషల్ మీడియాలో ఓ వర్గం హడావిడి చేస్తే తూచ్ అదేమీ లేదని తర్వాత తేలిపోయింది. అసలు ట్విట్టర్ లో కనీసం తన ఫీలింగ్స్ కూడా చెప్పుకోలేనంత నిరాశలో అతనున్న మాట వాస్తవం.

మరోవైపు దర్శకుడు పూరి జగన్నాధ్ ముంబైలో ఫ్లాట్ ఖాళీ చేసి హైదరాబాద్ తిరిగి వచ్చేశారట. డిస్ట్రిబ్యూటర్లు నష్టాల తాలూకు పరిహారాన్ని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన చర్చలు మొదలుపెట్టాల్సి ఉంది. అటు చూస్తేనేమో జనగణమన ఆపేయాల్సి వచ్చింది.

కొడుకు ఆకాష్ పూరితో తప్ప ఇంకే హీరోతోనూ ఇప్పటికిప్పుడు కొత్త ప్రాజెక్టు చేసే ఛాన్స్ లేదనే కామెంట్ లో నిజం లేకపోలేదు. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ పూరి మనసులో ఉన్నప్పటికి ది వారియర్ షాక్ లో ఉన్న రామ్ రిస్క్ తీసుకుంటాడా అనేది అనుమానమే.

ఇక ఛార్మీ రిలీజ్ రోజు పెద్దమ్మ గుడి దగ్గర కనిపించాక మళ్ళీ దర్శనమిస్తే ఒట్టు. చిన్న బ్రేక్ అంటూ ట్వీట్ వేయడం తప్ప తన సైడ్ నుంచి ఎలాంటి యాక్టివిటీ లేదు. నైజామ్ ఏరియాకు ఈ సినిమాని పంపిణి చేసిన వరంగల్ శీను తనకు అరవై శాతం దాకా నష్టాలు వచ్చాయని చెప్పడం.

క్లైమాక్స్ తప్ప లైగర్ బాగానే ఉందని సమర్ధించడం కొత్త చర్చకు దారి తీశాయి. ఇండస్ట్రీ ఎప్పుడూ ఇలాంటి డిజాస్టర్లు చూడలేదని కాదు. ఇంతకు మించినవే పెద్ద పెద్ద స్టార్లకు వచ్చాయి. కానీ లైగర్ మాత్రం హద్దులు లేని కథగా రోజుకో మలుపు తిరుగుతూ జనం నోళ్ళలో నానుతూనే ఉంది