దేవితో మాట్లాడ‌కుండానే పెళ్లి చేసేశారు

దక్షిణాదిన టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన‌ దేవిశ్రీ ప్రసాద్ విషయంలో చాలా వరకు అతడి మ్యూజిక్ గురించే చర్చలు నడుస్తుంటాయి. వ్యక్తిగత విషయాల్ని మీడియా వరకు రానివ్వడతను. ఐతే గతంలో ఛార్మితో అతడికి ముడి పెడుతూ కొన్ని రూమర్లు వచ్చాయి. ఆ తర్వాత అవి సద్దుమణిగాయి. తర్వాత ఎప్పుడూ దేవి ఎఫైర్ల గురించి కానీ.. రిలేషన్ షిప్స్ గురించి కానీ చర్చ లేదు. ఐతే కొన్నేళ్ల ముందు అతడి పేరును ఒక యంగ్ హీరోయిన్‌ తో ముడి పెడుతూ వార్త‌లొచ్చాయి.

ఆమే.. పూజిత పొన్నాడ. సుకుమార్-రామ్ చ‌ర‌ణ్‌ల‌ రంగస్థలంలో ఆమె ఓ పాత్ర చేసింది. అంతకుముందు సుక్కు నిర్మాణంలో వచ్చిన దర్శకుడులో ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించింది. ఆ త‌ర్వాత కూడా అడపా దడపా కొన్ని సినిమాల్లో న‌టిస్తూ వ‌స్తోంది. ఈ అమ్మాయితో దేవిశ్రీ ప్రేమలో పడ్డాడని.. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఆ మ‌ధ్య జోరుగా వార్త‌లొచ్చాయి.

తాజాగా పూజిత‌ క‌థానాయిక‌గా న‌టించిన ఆకాశ‌వీధుల్లో అనే సినిమా రిలీజైంది. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన పూజిత‌… దేవిశ్రీతో త‌న ప్రేమాయ‌ణం, పెళ్లి అంటూ వ‌చ్చిన వార్త‌ల గురించి స్పందించింది. అస‌లు దేవిని తాను ఒక్క‌సారి కూడా క‌ల‌వ‌క‌ముందే అత‌డితో త‌న‌కు పెళ్లి చేసేశార‌ని ఆమె వాపోయింది.. దేవిశ్రీ ప్రసాద్‌తో నేను రిలేషన్‌లో ఉన్నట్లు, మేమిద్దరం రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వచ్చిన వార్తల్లో నిజంలేదు. నాపై ఈ రూమర్లు వచ్చిన సమయానికి నేను ఆయన్ని కలిసింది కూడా లేదు.

చెన్నైలో ఉండగా వేదికలపై ఆయన పెర్ఫామ‌న్స్ చూడడం తప్ప నేరుగా దేవిని కలవలేదు. ఆ రూమర్‌ వచ్చి వెళ్లిపోయిన ఆరు నెలలకు ‘రంగస్థలం’ వంద రోజుల వేడుకలో మొదటిసారి నేను ఆయన్ని కలిశా. మొదటసారి మాట్లాడింది కూడా అప్పుడే! అప్పటికే జనాల దృష్టిలో మా ఇద్దరి పెళ్లి కూడా అయిపోయింది. అసలు ఇలాంటి క్రేజీ గాసిప్స్‌ ఎలా క్రియేట్‌ చేస్తారో నాకు అర్థం కాదు. ఇలాంటి వాటిని పట్టించుకుంటే ఈ ఇండస్ట్రీలో ముందుకు సాగడం కష్టం.. అని పూజిత వివ‌రించింది.