ఒకవేళ లైగర్ బ్లాక్ బస్టర్ అయ్యుంటే ప్రీ రిలీజ్ టైంలో విజయ్ దేవరకొండ అన్నట్టు ఇదే అన్ని ఇండస్ట్రీలలోనూ హాట్ టాపిక్ అయ్యేది. ఇప్పుడూ మాట్లాడుకుంటున్నారు కానీ దారుణమైన డిజాస్టర్ ఫలితం గురించి. ఏకంగా అరవై కోట్ల దాకా నష్టాలతో తెలుగులో ఉన్న టైర్ టూ హీరోల్లో బిగ్గెస్ట్ ఫ్లాప్ ని రౌడీ హీరో మూటగట్టుకోవడం ఖాయమైపోయింది. నిన్నటితో మొదటివారం పూర్తి కావడం ఆలస్యం చాలా చోట్ల స్క్రీన్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి.
దీనికి కేటాయించిన బిసి సెంటర్ల థియేటర్లు రేపు రిలీజ్ కాబోతున్న వాటికి, మంచి రన్ లో ఉన్న బింబిసార, కార్తికేయ 2లకు ఇచ్చేస్తున్నారు. ఇకపై లైగర్ కలెక్షన్ల గురించి మాట్లాడుకోకపోవడమే బెటర్. ఇప్పుడీ ప్రభావం నేరుగా నెక్స్ట్ రాబోయే ఖుషి మీద పడుతోంది. విజయ్ దేవరకొండ సమంతా ఫస్ట్ టైం కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ షూటింగ్ దాదాపు సగం పైనే అయిపోయింది.
ముందు డిసెంబర్ రిలీజ్ ఫిక్స్ చేశారు కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా మార్చుకోక తప్పేలా లేదు. ఒకవేళ అఖిల్ ఏజెంట్ కనక ఆ నెల మూడో వారంలో రాకపోతే ఖుషిని దించుతారు. కానీ లైగర్ తాలూకు ప్రభావం దీని మీద ఎంతలేదన్నా ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ దర్శకుడు శివ నిర్వాణ సైతం టక్ జగదీష్ తో ఫ్లాపు కొట్టిన తర్వాత ఇది చేస్తున్నాడు. ఇవి చాలవన్నట్టు పవన్ కళ్యాణ్ కల్ట్ క్లాసిక్ టైటిల్ ని దీనికి పెట్టేసుకున్నారు.
అనౌన్స్ మెంట్ టైంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి కొంత వ్యతిరేకత కనిపించింది కానీ తర్వాత సైలెంట్ అయ్యారు. ఇప్పుడీ ఖుషి ఏ మాత్రం అటుఇటు అయినా వీళ్ళే ఆ ట్రోలింగ్ బ్యాచ్ లో ఉంటారు. నాని గ్యాంగ్ లీడర్ కి ఇది ప్రత్యక్షంగా అనుభవమయ్యింది. సో ఇన్ని రకాలుగా అన్నివైపులా ప్రెజర్ అందుకోబోతున్న ఖుషి ఎలాంటి మేజిక్ చేయబోతోందో చూడాలి. అసలే దీని తర్వాత విజయ్ దేవరకొండకు కొంత గ్యాప్ వచ్చేలా ఉంది. అందుకే గట్టి హిట్టుతో బ్రేక్ తీసుకోవడం చాలా అవసరం.