అభిమానులందు.. పవన్ అభిమానులు వేరు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఏది రిలీజవుతున్నా అభిమానుల సందడి అలా ఇలా ఉండదు. పవన్ ఏదైనా సినిమా మొదలుపెడుతున్నపుడు, అది మేకింగ్ దశలో ఉన్నపుడు నెగెటివిటీ కనిపించినా సరే.. అభిమానులే ఆ చిత్రాన్ని వ్యతిరేకించినా సరే.. రిలీజ్ టైంకి కథ మొత్తం మారిపోతుంది. ఆటోమేటిగ్గా హైప్ వచ్చేస్తుంది. రీమేక్ సినిమాలు, పేరున్న దర్శకులు చేయని కాటమరాయుడు, వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లాంటి సినిమాలకు కూడా రిలీజ్ సమయంలో మామూలు హైప్ రాలేదు.

ఇప్పుడు లో హైప్ ఉన్న ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి కూడా రేప్పొద్దున విడుదల ముంగిట హంగామా ఒక రేంజిలో ఉంటుందనడంలో సందేహం లేదు. పవన్ క్రేజ్‌, ఆయన అభిమానుల మ్యాడ్‌ ఫ్యానిజంను మ్యాచ్ చేయడం అంత తేలిక కాదు. ఐతే కొత్త సినిమాలకు హంగామా చేయడం ఒకెత్తయితే.. ఎప్పుడో 23 ఏళ్ల కిందట విడుదలైన ‘తమ్ముడు’ సినిమాకు వాళ్లు చేసిన హడావుడి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.

సెప్టెంబరు 2న పవన్ పుట్టిన రోజును పురస్కరించుకుని రెండు రోజుల ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘తమ్ముడు’ స్పెషల్ షోలు వేశారు. ‘జల్సా’ సినిమాకు గురు, శుక్రవారాలకు షోలు భారీ స్థాయిలో ప్లాన్ చేయడం తెలిసిందే. దీని గురించి ముందు నుంచి డిస్కషన్ నడుస్తోంది. దాని ప్లానింగ్ కూడా చాలా పెద్ద స్థాయిలోనే జరిగింది. కానీ ‘తమ్ముడు’ షోల గురించి పెద్ద చర్చేమీ లేదు. చడీచప్పుడు లేకుండా షోలు వేశారు. అభిమానుల్లో కూడా దీని గురించి పెద్దగా డిస్కషన్ లేదు.

కానీ ఈ సినిమాను ప్రదర్శించిన థియేటర్లలో సందడి మామూలుగా లేదు. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్సులో ఉదయం 8.45కి ఐదు స్క్రీన్లలో  తమ్ముడు షోలు ప్రదర్శించడం విశేషం. ఆ టైంకి మాల్ ముందు వేల మంది అభిమానులతో నిండిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యిే పరిస్థితి తలెత్తింది. కొత్తగా ఏవైనా పెద్ద హీరోల సినిమాలు రిలీజైనపుడు మాత్రమే ఈ సందడి కనిపిస్తుంది.

దాన్ని మించి బుధవారం పవన్ ఫ్యాన్స్ హడావుడి కనిపించింది. ఇక థియేటర్ల లోపల వాళ్లు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఒక్క ఫ్యాన్ కూడా కుదురుగా కూర్చున్నది లేదు. స్క్రీన్ ముందే డ్యాన్సులు, పవన్‌ను అనుకరిస్తూ బాక్సింగ్ ఫైట్లు, పుషప్‌లు తీయడాలు.. అబ్బో మామూలు హంగామా కాదు ఇది. ఏపీలో పలు చోట్ల ‘తమ్ముడు’ థియేటర్లలో ఇదే సందడి కనిపించింది. పెద్దగా ప్లానింగ్ జరగని ‘తమ్ముడు’కే ఇలా ఉంటే.. భారీ ప్లానింగ్‌తో వేస్తున్న ‘జల్సా’ స్పెషల్ షోలకు ఇంకెంత హంగామా ఉంటుందో?