‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అతడి క్రేజ్ దేశ విదేశాలకు విస్తరించింది. తన మార్కెట్ కూడా బాగా పెరిగింది. కాబట్టి ఇకపై అతను చేసే సినిమాల స్కేల్ పెద్దగా ఉండాల్సిందే. ఈ క్రమంలోనే తన కొత్త చిత్రాల విషయంలో చరణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆల్రెడీ శంకర్ లాంటి మెగా డైరెక్టర్‌తో ఓ సినిమా చేస్తున్న చరణ్.. దీని తర్వాత గౌతమ్ తిన్ననూరితో అనుకున్న సినిమాను పక్కన పెట్టినట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
గౌతమ్ కథ క్లాస్ టచ్ ఉన్నది కావడం, మారిన తన ఇమేజ్‌కు అది సెట్ కాదని అనిపించడంతోనే చరణ్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. దీని స్థానంలో అతను వేరే సినిమాకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. చరణ్.. కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ లోకేష్ కనకరాజ్‌తో మెగా పవర్ స్టార్ జట్టు కట్టే అవకాశాలున్నట్లు సమాచారం.
చరణ్-లోకేష్ కలయికలో ఓ సినిమా చేసేందుకు టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ప్రయత్నిస్తోందట. ఈ మేరకు జోరుగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. యువి అధినేతలతో చరణ్‌కు గొప్ప అనుబంధం ఉంది. ఆ బేనర్లో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నప్పటికీ కుదరట్లేదు. ఇక లోకేష్‌తోనూ చరణ్‌కు మంచి స్నేహమే ఉంది. చరణ్ తనకు ఎంత క్లోజో స్వయంగా లోకేషే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. చరణ్‌తో సినిమా చేసే అవకాశాలున్నట్లు కూడా సంకేతాలు ఇచ్చాడు.
‘విక్రమ్’ సినిమా తర్వాత అతడి డిమాండ్ ఎంత పెరిగిపోయిందో తెలిసిందే. అతను ప్రస్తుతానికి విజయ్‌తో ఒక సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఖైదీ-2, విక్రమ్-2 సినిమాలు చేయాల్సి ఉంది. కానీ అవి ఎప్పుడు పట్టాలెక్కుతాయో క్లారిటీ లేదు. ఈ లోపు చరణ్ సినిమా మధ్యలోకి వస్తే ఆశ్చర్యమేమీ లేదు. శంకర్ సినిమాను చరణ్, విజయ్ సినిమాను లోకేష్ పూర్తి చేసి వచ్చే ఏడాది మధ్యలో తమ కలయికలో సినిమాను పట్టాలెక్కిస్తారేమో చూడాలి మరి.
Gulte Telugu Telugu Political and Movie News Updates