గత కొన్నేళ్లలో టాలీవుడ్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ల లిస్టు తీస్తే.. ఈ ఏడాది విడుదలైన రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు కచ్చితంగా అందులో చోటు సంపాదిస్తాయి. అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలమైన ఈ రెండు చిత్రాలు.. వాటిని నమ్ముకున్న అందరికీ చేదు అనుభవాన్ని మిగిల్చాయి. బయ్యర్లను నిలువునా ముంచేశాయి. వీటిలో ‘రాధేశ్యామ్’ కొంచెంలో కొంచెం నయం. సినిమా మరీ భరించలేని విధంగా ఉండదు. అందులో కొన్ని ఆకర్షణలు ఉన్నాయి. ఈ చిత్రానికి ఓపెనింగ్స్ పర్వాలేదు.
కానీ ‘ఆచార్య’ అలా కాదు. సినిమా పూర్తయ్యే లోపు ప్రేక్షకులు హాహాకారాలు పెట్టేశారు. ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. రెండో రోజు థియేటర్లు పూర్తిగా వెలవెలబోయాయి. ఇప్పుడు ‘లైగర్’ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ‘ఆచార్య’తో పోలిస్తే దీనికి ప్రి రిలీజ్ హైప్ బాగానే వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. కానీ సినిమా మరీ పేలవంగా ఉండడం, నెగెటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అవడంతో రెండో రోజుకు థియేటర్లు ఖాళీ అయిపోయాయి.
తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లలో మేజర్ డ్రాప్ కనిపించింది. వీకెండ్లో కూడా సినిమా నిలబడలేకపోయింది. ఇక ఆదివారం తర్వాత అయితే పరిస్థితి దారుణం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘లైగర్’ థియేటర్లలో మెయింటైనెన్స్ ఖర్చులకు సరిపడా వసూళ్లు కూడా రాలేదు. సినిమాను నడిపిస్తే ఆదాయం రాకపోగా చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ విషయంలో ‘ఆచార్య’, ‘లైగర్’ దేనికి అదే సాటి అనిపించాయి.
ముందు జరిగిన అగ్రిమెంట్ల వల్ల పేరుకు చాలా థియేటర్లలో ‘లైగర్’ను నడిపిస్తున్నారే తప్ప.. ఈ సినిమా నుంచి ఇక ఆశించడానికి ఏమీ లేకపోయింది. సోమవారం జనాల్లేక షోలు రద్దు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కొన్ని చోట్ల ‘లైగర్’ షోలు తీసేసి కార్తికేయ-2, సీతారామం చిత్రాలను ఆడిస్తున్నారు. ‘లైగర్’ వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు రూ.90 కోట్లకు అమ్ముడుపోగా.. ఇప్పటిదాకా ఈ చిత్రం రాబట్టిన షేర్ రూ.25 కోట్లు మాత్రమే. దీనికి మించి ఇక వచ్చేదేమీ లేకపోవడంతో ‘లైగర్’ ఎపిక్ డిజాస్టర్ల జాబితాలో నిలవబోతోంది.