పుష్ప‌ 2లో ఇంకో విల‌న్‌

ఇప్పుడు ఇండియా అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్త‌న్న సీక్వెల్ అంటే పుష్ప-2నే. గ‌త ఏడాది డిసెంబ‌ర్లో రిలీజైన పుష్ప‌-ది రైజ్ ఎంత పెద్ద హిట్ట‌యిందో, పుష్ప‌-ది రూల్ మీద ఎంత‌గా అంచ‌నాలు పెంచిందో తెలిసిందే. ఆ అంచ‌నాల‌ను అందుకోవ‌డానికి సుకుమార్ అండ్ టీం మ‌రింత క‌ష్ట‌ప‌డుతోంది. స్క్రిప్టు మీద చాలా స‌మ‌యం వెచ్చించ‌డం వ‌ల్ల ఈ సినిమా షూటింగ్ అనుకున్న స‌మ‌యానికి మొద‌లు కాలేదు.

ఐతే ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మం పూర్తి చేయ‌గా సెప్టెంబ‌రులో చిత్రీక‌ర‌ణ మొద‌లైపోతుంద‌ని స‌మాచారం. సీక్వెల్లో ఫాహ‌ద్ ఫాజిల్ ప్ర‌ధాన విల‌న్ అవుతాడ‌ని, అత‌డితో బ‌న్నీ పోరు నేప‌థ్యంలోనే ప్ర‌ధానంగా క‌థ న‌డుస్తుంద‌ని అందరికీ అంచ‌నా ఉంది. ఈ దిశ‌గా పుష్ప క్లైమాక్స్‌లో హింట్ ఇచ్చి వ‌దిలేశాడు సుక్కు.

ఫాహ‌ద్‌కు తోడు సునీల్, అన‌సూయ‌, అజ‌య్ ఘోష్‌, ధ‌నంజ‌య‌.. ఇలా బ‌న్నీని టార్గెట్ చేసే విల‌న్ల సంఖ్య పెద్ద‌దే. ఐతే వీరు స‌రిపోర‌ని ఇంకో విల‌న్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. పుష్ప‌-1లో బ‌న్నీకి అండ‌గా ఉండే ఎంపీ పాత్ర‌లో రావు ర‌మేష్ క‌నిపిస్తాడ‌న్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర‌చంద‌నం సిండికేట్ మొత్తం పుష్ప చేతిలో పెట్టి తెర వెనుక న‌డిపిస్తుంటాడ‌త‌ను. ఐతే పార్ట్-2లో ఈ పాత్ర‌కు ఎదురు నిలిచి పుష్ప‌ను ఇబ్బంది పెట్టే ఇంకో పొలిటీషియ‌న్ పాత్ర ఉంటుంద‌ట‌.

అత‌ను, ఫాహ‌ద్ క‌లిసి బ‌న్నీకి స‌వాలు విసురుతార‌ట‌. ఈ పాత్ర‌కు పేరున్న న‌టుడినే తీసుకోవాల‌న్న‌ది సుకుమార్ ఆలోచ‌న‌. బ‌న్నీ స‌రైనోడు మూవీలో విల‌న్‌గా న‌టించిన ఆది పినిశెట్టితో పాటు మ‌రికొంద‌రిని ఈ పాత్ర‌కు ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలిసిందే. త్వ‌ర‌లోనే న‌టుడిని ఖ‌రారు చేసి అధికారిక ప్ర‌క‌ట‌న ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ద‌స‌రాకు రిలీజ్ చేసే ఆలోచ‌న‌లో చిత్ర బృందం ఉంది.