జీవితానికి ఈ సౌండ్ సరిపోదు

కెరీర్ మొత్తంలో మొదటిసారి అత్యంత బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు శర్వానంద్. అతని కొత్త సినిమా ఒకే ఒక జీవితం వచ్చే నెల 9న విడుదలకు రెడీ అవుతోంది. చాలాసార్లు వాయిదా పడి కొన్ని నెలల పాటు మౌనంగా ఉండి ఎట్టకేలకు థియేటర్లకు తీసుకొస్తున్నారు. పేరుకైతే రిలీజనే మాటే కానీ దీని మీద మినిమమ్ బజ్ లేదు. రీతూ వర్మ, అమల అక్కినేని, నాజర్, ప్రియదర్శి లాంటి ప్రామిసింగ్ క్యాస్ట్ ఉన్నా కూడా అది సరైన రీతిలో ఆడియన్స్ కి రిజిస్టర్ కావడం లేదు. ఇలాగే ఉంటే మొదటి వారం కనీస ఓపెనింగ్స్ ఆశించడం కష్టమే.

ఆ రోజు చాలా సవాళ్లున్నాయి. మొదటిది బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ. ప్యాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతున్న ఈ విజువల్ గ్రాండియర్ కోసం నిర్మాత కరణ్ జోహార్ భారీ ప్లానింగ్ చేసుకున్నాడు. తెలుగు వెర్షన్ కూడా వస్తోంది కనక స్క్రీన్ కౌంట్ ఎక్కువగానే ఉంటుంది. హీరో రన్బీర్ కపూరే అయినప్పటికీ నాగార్జున పాత్రను హై లైట్ చేస్తూ ప్రమోషన్ వేగం పెంచబోతున్నారు. దీనికేం బాహుబలి రేంజ్ లో హైప్ లేకపోయినా టాక్ మీద నమ్మకంతో టీమ్ పెద్ద రిస్కే చేస్తోంది. సో ఇంత స్కేల్ లో వస్తున్నప్పుడు తేలిగ్గా తీసుకోవటానికి ఛాన్స్ లేదు.

మరోవైపు కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని సైతం అదే రోజు తీసుకొస్తున్నారు. సెబాస్టియన్, సమ్మతమే రెండు వరస ఫ్లాపులు ఇతని మార్కెట్ మీద ప్రభావం చూపించడంతో ఇదీ మౌత్ టాక్ మీద ఆధారపడాల్సిందే. సత్యదేవ్ తమన్నాల గుర్తుందా శీతాకాలం కూడా అదే డేట్ లాక్ చేసుకుంది. వీటికి వారం ముందు వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా వచ్చి ఉంటుంది. సో ఇన్ని ప్రతికూలతల మధ్య కొత్త దర్శకుడు శ్రీకార్తీక్ డీల్ చేసిన ఒకే ఒక జీవితం మీద జనం దృష్టి పడాలంటే పబ్లిసిటీ సౌండ్ పెంచాల్సిందే.