త్రివిక్రమ్ ఎస్.. మహేష్ నో?

‘బాహుబలి’తో ప్రభాస్ పెద్ద పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లకూ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. వీరి మార్కెట్లూ పెరిగాయి. ఐతే అల్లు అర్జున్ మాత్రం రాజమౌళి అండ లేకుండానే ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమా చేసి, సరిగ్గా మార్కెట్ చేస్తే ఎవ్వరైనా పాన్ ఇండియా స్టార్ కావచ్చనడాడనికి ఇది ఉదాహరణ. ఐతే పై వరుసలోని హీరోల కంటే ముందు సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించి.. తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్న మహేష్ మాత్రం పాన్ ఇండియా రేసులో వెనుకబడే ఉన్నాడు.

‘స్పైడర్’తో తమిళంలో పాగా వేయాలన్న ప్రయత్నం ఫలించకపోవడంతో తర్వాత పక్క చూపులే చూడడం లేదు. ఐతే అతను త్వరలోనే రాజమౌళితో జట్టు కడుతుండటంతో ఈ సినిమాతో ఆటోమేటిగ్గా పాన్ ఇండియా ఏంటి.. పాన్ వరల్డ్ ఇమేజ్ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఐతే అంతకంటే ముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం చేస్తున్నాడు మహేష్. ఇప్పటిదాకా త్రివిక్రమ్ సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాలేదు.

కానీ ఈసారి మహేష్‌తో ఆయన చేయబోయేది పాన్ ఇండియా అప్పీల్ ఉన్న కథ అని.. అందులో బోలెడంత యాక్షన్, మాస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని సమాచారం. మహేష్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాకున్నా అతడికి దేశవ్యాప్తంగా గుర్తింపు అయితే ఉంది. ఇక ఇందులో కథానాయికగా నటించే పూజా హెగ్డే బాలీవుడ్ భామే. ఇందులో నటించే వేరే ఆర్టిస్టులు కూడా దేశ్యాప్తంగా తెలిసిన వారే ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే డిస్కషన్ నడుస్తోందట. త్రివిక్రమ్‌తో పాటు నిర్మాతలు అందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మహేష్ మాత్రమే ఈ విషయంలో ఆసక్తితో లేడట. రాజమౌళి సినిమాతోనే హిందీలో బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇవ్వాలని, అరాకొరా ప్రయత్నాలు వద్దని అతను ఫీలవుతున్నాడట. బహుశా ‘స్పైడర్’ అనుభవం అతణ్ని వెనక్కి లాగుతుండొచ్చు. ప్రస్తుతానికైతే హిందీ వెర్షన్‌పై వెనక్కి తగ్గినట్లే అంటున్నారు. కానీ తర్వాత ఆలోచన మారొచ్చేమో.