ఒకప్పటి బ్లాక్ బస్టర్ల పట్ల అభిమానుల్లో ఉండే క్రేజ్ ని క్యాష్ చేసుకునే ట్రెండ్ జోరందుకుంది. పోకిరికి భీభత్సమైన రెస్పాన్స్ రావడంతో ఒక్కొక్కరుగా ఆ బాట పడుతున్నారు. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఘరానా మొగుడు, సెప్టెంబర్ 2 పవన్ బర్త్ డే సందర్భంగా జల్సాకి స్పెషల్ ప్రీమియర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున ఫ్యాన్స్ 29న సోగ్గాడే చిన్ని నాయనాకు ప్లాన్ చేసుకుంటున్నారని టాక్ వచ్చింది. మొత్తానికి క్రమం తప్పకుండ ఇకపై బిగ్ స్క్రీన్ మీద క్లాసిక్స్ చూసే అవకాశాలు వస్తూనే ఉంటాయి.
ఇదంతా బాగానే ఉంది కానీ వీటికి కూడా కొత్త సినిమాలకు ఉంటున్న టికెట్ రేట్లే పెట్టడం సగటు ప్రేక్షకులకు అన్నీ చూసే ఛాన్స్ ని పోగొడుతున్నాయి. ఉదాహరణకు ప్రసాద్ ఐమ్యాక్స్ లో వీటికి 200 రూపాయలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ మల్టీ ప్లెక్సుల్లో 177 అలాగే కంటిన్యూ అవుతోంది. వీటిని తగ్గించి అమ్మొచ్చుగా అనేది ఫ్యాన్స్ మాట. ఎంత వీటిని మరోసారి థియేటర్ లో చూడాలన్న ఆత్రం ఉన్నా దాన్ని ఈ స్థాయిలో క్యాష్ చేసుకుంటే ఎలాని ప్రశ్నిస్తున్నారు. ఇలా చేస్తే వీటిపై ఆసక్తి తగ్గిపోతుందన్న మాటలో లాజిక్ ఉంది.
జనం సినిమా హాళ్ల పట్ల ఆసక్తి తగ్గిపోతున్న టైంలో బింబిసార, కార్తికేయ 2, సీతారామంలు ఇచ్చిన కిక్ మామూలుది కాదు. దేశం మొత్తం మనవైపే చూసేలా కలెక్షన్లు వచ్చి పడ్డాయి. ఏ బాషలోనూ ఒకే నెలలో ఇంత సక్సెస్ రేట్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాత చిత్రాలను కూడా ఇంతగా ఆదరిస్తున్న మూవీ లవర్స్ కోసమైనా వీటికి తగ్గింపు ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. అసలే ఈ సిరీస్ లో వర్షం, దేశముదురు, ఇంద్ర, సమరసింహారెడ్డి, సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్స్ క్యూలో ఉన్నాయి. యుట్యూబ్ లో ఉన్నవాటికి మళ్ళీ థియేటర్లకు రప్పించాలంటే డిస్కౌంట్లు ఇస్తే బెటర్ కదా.